మార్చ్ 2015 నాటికి హ్యుందాయ్ ఎలైట్ ఐ20 క్రాసోవర్ లాంచ్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అతికొద్ది కాలంలోనే మంచి సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసినదే. స్టయిలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ మోడల్‌ను ఆధారంగా చేసుకొని మరో క్రాసోవర్‌ను అభివృద్ధి చేస్తోంది.
వచ్చే ఏడాది మార్చ్ నాటికి హ్యుందాయ్ ఎలైట్ ఐ20 క్రాసోవర్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రాసోవర్ ధర రూ.7-10 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో ఆఫర్ చేస్తున్న 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్లనే ఈ క్రాసోవర్‌లోను ఉపయోగించనున్నారు.

సికింద్రాబాద్ మెట్టుగూడలో సాబూ హ్యుందాయ్ షోరూమ్‌ని ప్రారంభించిన సందర్భంగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ చీఫ్ కోఆర్డినేటర్ యంగ్ జిన్ ఆన్ మాట్లాడుతూ.. 2015లో రెండు కొత్త కార్లను విడుదల చేస్తామని, వీటిలో ముందుగా ఎలైట్ ఐ20 క్రాసోవర్‌ను మార్చ్ నాటికి విడుదల చేస్తామని, ఆ తర్వాత వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేస్తామని చెప్పారు.
హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలను వెల్లడించకపోయిననప్పటికీ.. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఐఎక్స్25 మోడల్ ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకోనున్న ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీనే ఇండియాలోను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








