టాక్సీ అవతారంలో కనిపించనున్న హ్యుందాయ్ ఐ10
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ హ్యుందాయ్ ఐ10 త్వరలోనే టాక్సీ అవతారంలో కనిపించనుంది. ఇదివరకూ బెస్ట్ టాక్సీగా ఉన్న హ్యుందాయ్ శాంత్రో మార్కెట్ నుంచి తొలగిపోనున్న నేపథ్యంలో, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐ10 మోడల్‌ను టాక్సీగా మార్చాలని కంపెనీ నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగానే, ముందుగా ముంబైలో యల్లో టాక్సీ మార్కెట్లో హ్యుందాయ్ ఐ10 టాక్సీలను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత క్రమంగా వీటిని ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా నగరాలకు విస్తరించనున్నారు. ముంబై టాక్సీ మార్కెట్లో దాదాపు 7,843 పర్మిట్లు ఉన్నాయి, రానున్న కొద్ది నెలల్లోనే వీటికి గ్రీన్ సిగ్నల్ లభించనుంది. ఈ నేపథ్యంలో, ఐ10 టాక్సీని పరిచయం చేయటానికి ఇదే సరైన సమయం అని కంపెనీ భావిస్తోంది.
టాక్సీ విభాగంలో అత్యధిక మంది ప్రధాన్యతనిచ్చిన మోడల్ హ్యుందాయ్ శాంత్రో అని, ఇది తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, దీని నిర్వహణా వ్యయం కూడా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని, శాంత్రో నిలుపదలతో ఈ సెగ్మెంట్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఐ10 మోడల్‌ను టాక్సీ ఆప్షన్‌గా అందుబాటులో ఉంచుతామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.

టాక్సీ సెగ్మెంట్ కోసం హ్యుందాయ్ ఐ10లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌ను ఆఫర్ చేయనున్నారు. అంతేకాకుండా.. ఈ మోడల్‌లో పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్ లేని ఓ బేస్ వేరియంట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. పాత ప్రీమియర్ పద్మిని టాక్సీలను రీప్లేస్ చేసేందుకు దాదాపు 25,000 మంది క్యాబ్ ఓనర్లు శాంత్రో కోసం ఆర్డర్లు ప్లేస్ చేసినట్లు సమాచారం.
హ్యుందాయ్ తమ క్యాబ్ వెర్షన్ ఐ10 ధరను డ్రైవర్లకు అందుబాటులో ఉంచినట్లయితే, టాక్సీ మార్కెట్లో ఇదొక చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుందని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. మారుతి సుజుకి తమ రిట్జ్ మోడల్ ద్వారా, అలాగే టాటా మోటార్స్ తమ ఇండికా మోడల్ ద్వారా టాక్సీ మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








