దేశీయ అమ్మకాలపై దృష్టి సారించిన హ్యుందాయ్ ఇండియా
ఇటీవలే భారత్ నుంచి యూరప్ మార్కెట్‌కు ఎగుమతులు నిలిపివేసిన హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఇప్పుడు దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయ అమ్మకాలలో 8 శాతం వృద్ధిని సాధించాలని, ఈ ఏడాది మొత్తం 4.10 లక్షల వాహనాలను విక్రయించాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
మెరుగుపడిన కొనుగోలుదారుల సెంటిమెంట్, కొత్త ఉత్పత్తుల విడుదల సాయంతో ఇది సాధ్యమవుతుందని హ్యుందాయ్ భావిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు కొత్త మోడళ్లను (గ్రాండ్ ఐ10, ఎక్సెంట్, ఎలైట్ ఐ20) మార్కెట్లోకి తీసుకొచ్చింది.

గడచిన సంవత్సరం(2013)లో హ్యుందాయ్ దేశీయ విపణిలో 3.8 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది (2014)లో 4.10 లక్షల వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటె (హెచ్ఎమ్ఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు.
గడచిన మూడు నెలలుగా కస్టమర్ సెంటిమెంట్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపించిందని, ఫలితంగా ఆటోమోటివ్ విభాగంలో అమ్మకాలు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. తాము 2013లో మొత్తం 6.33 లక్షల వాహనాలను విక్రయిస్తే, అందులో 2.53 లక్షల వాహనాలను విభిన్న అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసినట్లు ఆయన వివరించారు.
హ్యుందాయ్ చెన్నైలో ఉన్న ఉత్పత్తి కేంద్రాల ద్వారా ప్రస్తుతం సంవత్సరానికి 6.4 లక్షల వాహనాలను తయారు చేస్తుంది, షిఫ్టులను మార్పు చేయటం ద్వారా ఈ సామర్థ్యాన్ని 6.8 లక్షలకు పెంచవచ్చు.


Click it and Unblock the Notifications








