2015 ఆరంభంలో హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ లాంచ్!
సరికొత్త హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్ల రాకతో మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో పోటీ జోరందుకుంది. ప్రస్తుతం ఈ రెండు మోడళ్ల మధ్య మంచి పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో, కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ మిడ్-సైజ్ సెడాన్ వెర్నా ఈ పోటీని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పోటీని తట్టుకునేందుకు హ్యుందాయ్ తమ వెర్నా సెడాన్‌లో ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి ఈ ఫేస్‌లిఫ్ట్ హ్యుందాయ్ వెర్నా ఇప్పటికే రష్యన్ మార్కెట్లో విడుదలై మంచి సక్సెస్‌ను సాధించింది. భారత మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా పేరుతో అమ్ముడుపోతున్న ఈ సెడాన్ రష్యా మార్కెట్లో హ్యుందాయ్ సోలారిస్ పేరుతో విక్రయిస్తున్నారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలోపే కొత్త 2015 వెర్నాను మార్కెట్లోకి తీసుకురావాలని హ్యుందాయ్ భావిస్తోంది. ఇప్పటికే ఎలైట్ ఐ20 మోడల్‌ను విడుదల చేసి మంచి సక్సెస్ మీదున్న హ్యుందాయ్ కొత్త సంవత్సరంలో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే, వచ్చే జనవరిలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఎలాంట్రా ప్రీమియం సెడాన్‌ను విడుదల చేయనుంది.

ఎలాంట్రా సెడాన్ తర్వాత రానున్న రెండవ ఉత్పత్తి ఫేస్‌లిఫ్ట్ వెర్నా. ఈ కొత్త వెర్నా సెడాన్‌ను ఫ్లూయిడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా.. రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్, రీస్టయిల్డ్ ఫాగ్ ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్, ట్విన్ హారిజాంటల్ క్రోమ్ గ్రిల్, సన్నటి మరియు వెడల్పాటి ఎయిర్ ఇన్‌టేక్ డ్యామ్ వంటి మార్పులను, అలాగే హెడ్‌లైట్స్ చుట్టూ ఉండే స్టయిలిష్ బాడీ లైన్స్ కూడా ఇందులో కొత్తగా డిజైన్ చేశారు.
వెనుక వైపు డిజైన్‌లో మార్పులు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. రియర్ డిజైన్‌లో ప్రధానంగా, ఎల్ఈడి లైట్లతో తయారు చేయబడిన బ్రేక్ ల్యాంప్స్, వెనుక బంపర్‌కు దిగువ భాగంలో అమర్చబడిన రిఫ్లెక్టర్స్, బూట్ డోర్‌పై క్రోమ్ గార్నిష్, బంపర్ క్రింది భాగంలో బ్లాక్ కలర్ ప్లాస్టిక్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.
ఇకపోతే, కొత్త 2014 హ్యుందాయ్ వెర్నా సెడాన్ ఇంటీరియర్లలో చెప్పుకోదగిన ప్రధాన మార్పులేవీ లేవని తెలుస్తోంది. సరికొత్త 2014 హోండా సిటీ సెడాన్ రాక ముందు వరకు బెస్ట్ సెల్లింగ్ సెడాన్ ఉన్న హ్యుందాయ్ వెర్నా, సిటీ రాకతో దీని అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో, వెర్నాకు పూర్వ వైభవాన్ని కల్పించేందుకు కంపెనీ ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను వీలైనంత త్వరగా భారత మార్కెట్లో విడుదల చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








