త్వరలో హ్యుందాయ్ శాంత్రో, షెవర్లే స్పార్క్ ఉత్పత్తి బంద్!
హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి అత్యంత పాపులర్ అయిన శాంత్రో కారు ఇకపై మార్కెట్ నుంచి తొలగిపోనుంది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ భారత్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన శాంత్రో కారు ఉత్పత్తిని కంపెనీ ఇకపై నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
అలాగే, భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్మాల్ కార్ సెగ్మెంట్లో పాపులర్ అయిన మరో చిన్న కారు షెవర్లే స్పార్క్ కూడా మార్కెట్ నుంచి కనుమరుగు కానుంది. అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియాకి, భారత విపణిలో మంచి పట్టు సాధించడానికి సహకరించిన షెవర్లే స్పార్క్ ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.

కాగా.. చివరి బ్యాచ్ హ్యుందాయ్ శాంత్రో కార్ల ఉత్పత్తి వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కానుండగా, జనరల్ మోటార్స్ తమ షెవర్లే స్పార్క్ ఉత్పత్తిని డిసెంబర్‌లో నిలిపివేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. హ్యుందాయ్ శాంత్రో, షెవర్లే స్పార్క్ (గతంలో ఇది దేవూ మాటిజ్ పేరుతో అమ్ముడయ్యేది) కార్లు భారత మార్కెట్లో మారుతి సుజుకి (అప్పట్లో మారుతి ఉద్యోగ్) కార్లకు పోటీ ఇచ్చేందుకు ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాయి.
ఈ ఎంట్రీ లెవల్ కార్లను మార్కెట్ నుంచి తొలగించాలని కార్ మేకర్లు నిర్ణయించుకోవటంతో దాదాపుగా అన్ని మొదటి తరం ఎంట్రీ-లెవల్ కార్లన్నీ మార్కెట్ నుంచి మాయం కానున్నాయి. మారుతి ఇప్పటికే తమ తొలి మోడల్ ఎమ్800 కారును మరియు శాంత్రో, మాటిజ్ కార్లకు పోటీగా వచ్చిన మారుతి జెన్ కారు ఉత్పత్తిని కూడా నిలిపివేసిన సంగతి తెలిసినదే.

హ్యుందాయ్ శాంత్రో తొలిసారిగా 1998లో మార్కెట్లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో 1.36 మిలియన్ యూనిట్లకు పైగా శాంత్రో కార్లను విక్రయించగా, 5,35,000 శాంత్రో కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.
అలాగే, జనరల్ మోటార్స్ కూడా దేవూ కార్ పోర్ట్‌ఫోలియోని ఓవర్‌టేక్ చేసిన తర్వాత 7 ఏళ్లలో 1,65,000 యూనిట్ల స్పార్క్ కార్లను విక్రయించింది. ఈ మోడళ్లు మార్కెట్ నుంచి తొలగిపోయినప్పటికీ, మరి కొన్నేళ్ల పాటు వీటికి సంబంధించిన విడిభాగాలను కస్టమర్లకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంటుంది.


Click it and Unblock the Notifications








