మేడ్ ఇన్ ఇండియా కార్లకు ఫ్రంట్ క్రాష్ టెస్ట్ తప్పనిసరి!
గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లలో భారతదేశంలో తయారైన (మేడ్ ఇన్ ఇండియా) కార్లు భద్రతా అంశాల పరంగా ఘోరంగా విఫలం కావటంతో, భారత సర్కారు మేల్కొంది. మనదేశంలో కూడా అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే, వచ్చే ఏడాది నుంచే వాహనాలకు క్రాష్ టెస్టులను నిర్వహించడం, ఇండియన్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
అంతేకాకుండా.. అక్టోబర్ 2015 నుంచి ఇండియాలో తయారయ్యే ప్రతి కొత్త కార్ మోడల్ కూడా గంటకు 56 కిలోమీటర్ల వేగం వద్ద ఫ్రంటల్ క్రాష్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ కావల్సి ఉంటుంది. ఇలాంటి టెస్ట్‌లను చేసేందుకు సదుపాయం ఏర్పాటు చేసిన తర్వాత, వచ్చే ఏడాది మార్చ్ నాటికి ఈ నిబంధనలపై ఓ స్పష్టత ఇస్తామని, ఈ నిబంధనను పాటించేందుకు తయారీదారులకు ఆరు నెలలకు పైగా సమయం ఇస్తామని రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ విజయ్ చిబ్బర్ తెలిపారు.

ఇండియాలో తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేసే కార్లలో తప్పనిసరిగా కనీస భద్రతా ఫీచర్లను ఆఫర్ చేసే కార్ మేకర్లు, దేశీయ మార్కెట్ కొనుగోలుదారుల కోసం అలాంటి ఫీచర్లను ఆఫర్ చేయలేరా అని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో తయారయ్యే కొత్త వాహనాల భద్రతను అంచనా వేసేందుకు 'భారత్ న్యూ వెహికల్ సేఫ్టీ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (బిఎన్‌విఎస్ఏపి) ప్రతిపాదించారు. ఇందులో సేఫ్టీ రేటింగ్‌లను స్టార్స్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది.
బిఎన్‌విఎస్ఏపి క్రాష్ టెస్టులో మేడ్ ఇన్ ఇండియా కార్లు ఐదు స్టార్లకు 5 స్టార్స్ లేదా 4-4.5 స్టార్స్ రేటింగ్‌ను దక్కించుకుంటే, అది సురక్షితమైన కారుగా పరిగణించడం జరుగుతుంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఓ ఇండిపెండెంట్ అథారిటీని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ అథారిటీ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కొత్త వాహనాల మోడళ్లను ఎంచుకొని, వాటి భద్రతా పరమైన అంశాలను సమీక్షించేందుకు ఈ టెస్ట్ కోసం పరిగణించడం జరుగుతుంది.

భారతదేశంలో ఈ బిఎన్‌విఎస్ఏపి క్రాష్ టెస్ట్ విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగినట్లయితే, ఇక్కడి మార్కెట్లో నాసిరకం కార్లను తయారు చేసే కార్ మేకర్ల ఆటలు చెల్లుతాయి. అంతేకాకుండా, ఇలాంటి కార్లను కొనుగోలు చేసి ప్రాణాలు కోల్పోయే అమాయకుల ప్రాణాలును ప్రభుత్వం కాపాడినట్లు అవుతుంది. మరి ఈ వ్యవస్థ ఎంత మేరకు విజయవంతం అవుతుందో వేచి చూద్దాం..!


Click it and Unblock the Notifications








