హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్ల కోసం రూ.14,000 కోట్ల సబ్సిడీ!
భవిష్యత్తంతా గ్రీన్ కార్లదే. ఇకపై మీరు హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును కొనాలనుకుంటే, ప్రభుత్వం నుంచి మీకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ప్రకృతి సాన్నిహిత్యమైన ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం సుమారు రూ.14,000 కోట్ల సబ్సిడీని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. శిలాజ ఇంధనంతో నడిచే వాహనానికి మరియు గ్రీన్ వెహికల్ మధ్య ధర వ్యత్యాసం ఆధారంగా సబ్సిడీని ప్రతిపాదించనున్నారు.
ఈ నిధుల క్లియరెన్స్ కోసం భారీ పరిశ్రమల శాఖా మంత్రి ఈ సబ్సిడీ ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన మేరకు పూర్తిగా బ్యాటరీతో నడిచే వాహనాలకు 35 శాతం సబ్సిడీని, కనీసం 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే (కేవలం బ్యాటరీ పవర్‌తోనే) ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాలకు 25 శాతం సబ్సిడీని ఆఫర్ చేయాలని యోచిస్తున్నారు.

అదేవిధంగా, మైల్డ్ హైబ్రిడ్ వాహనాల కొనుగోలుపై 15 శాతం సబ్సిడీని మరియు స్ట్రాంగర్ వెర్షన్ కొనుగోలుపై 25 శాతం ప్రయోజనాన్ని కొనుగోలుదారులు పొందవచ్చు. ప్రస్తుతం, మనదేశంలో లభిస్తున్న హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను చేతివేళ్లపై లెక్కపెట్టవచ్చు. టొయోట ప్రియస్, టొయోటా క్యామ్రీ వంటి హైబ్రిడ్ కార్లు, మహీంద్రా ఈ2ఓ వంటి ఎలక్ట్రిక్ కార్లు లభిస్తున్నాయి.
అయితే, ఈ సబ్సిడీ ప్రతిపాదన పూర్తిస్థాయిలోకి వస్తే మరిన్ని దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ కంపెనీలు ఈ విభాగంలో ఉత్పత్తులను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా, దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కూడా తమ ఉత్పత్తులలో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది.

ఆటోమొబైల్ కంపెనీల ద్వారా రూట్ చేయబడనున్న ఈ సబ్సిడీ ద్వారా చాలా మంది భారతీయులు పెట్రోల్, డీజిల్ కార్లను వదిలి ఈ ప్రకృతి సాన్నిహిత్య వాహనాల వైపు మొగ్గు చూపే ఆస్కారం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధంగా 2020 వరకు వాహనాలపై సబ్సిడీ ఇచ్చుకుంటూపోతే ప్రభుత్వానికి సుమారు రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుంది. కస్టమర్లు పూర్తిస్థాయిలో ఈ వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపితే, ఇంధనంపై ఆరేళ్ల సమయంలో సుమారు రూ.60,000 కోట్ల ఆదా అవుతుందని అంచనా.


Click it and Unblock the Notifications








