50 ఏళ్ల పురాతన వ్యాన్‌లో ప్రపంచ ప్రయాణం చేస్తున్న జంట
కారులో ప్రపంచాన్ని చుట్టి రావాలని చాలా మందికి కోరికుంటారు. ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న జంట కూడా అలానే కోరుకున్నారు, ఇంకేముందు. తమ పాత 50 ఏళ్ల నాటి ఫోక్స్‌వ్యాగన్ కోంబీ టైప్ 2 మినీ వ్యాన్‌లో ఐదేళ్య క్రితం తమ ప్రపంచ ప్రయాణం (వరల్డ్ టూర్) ప్రారంభించారు.
జర్మనీలో జన్మించిన వ్యాపారవేత్త జెన్స్ జాకబ్, ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, సాంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు గాను ఐదేళ్ల క్రితం వరల్డ్ టూర్ ప్రారంభించాడు. ఇందుకోసం అతను తన 1965 ఫోక్స్‌వ్యాగన్ కోంబీ వ్యాన్‌ను ఎంచుకున్నాడు. ఈ కారు ముద్దు పేరు 'బ్లూయీ'.

ఈ బ్లూయీలో ఓ చిన్న కిచెన్, వాటర్ ట్యాంక్ స్పేర్స్, టూల్స్‌తో పాటుగా కాలక్షేపం కోసం కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి. జెన్స్ జాకబ్ తొలుత తన ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. ఆ తర్వాత తన ప్రయాణంలో దుబాయ్‌లో ఓ స్త్రీని కలుసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం వారిద్దరూ జంటగా ఈ వరల్డ్ టూర్ చేస్తున్నారు. జెన్స్ భార్య పేరు సింథియా. వీరిద్దరూ ఇప్పటి వరకూ 60,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి సుమారు 26కు పైగా దేశాలను సందర్శించారు. వీరు సందర్శించిన దేశాల్లో నెథర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చ్యుగల్, ఇటలీ, గ్రీస్, టర్కీ, దుబాయ్, ఒమెన్, ఇరాన్ దేశాలున్నాయి.

ఈ వరల్డ్ టూర్‌లో ప్రస్తుతం వీరిద్దరూ భారతదేశానికి చేరుకున్నారు. ముంబై నుంచి వీరి ఇండియా టూర్ ప్రారంభమైంది. సముద్ర తీరం గుండా ప్రయాణించి పశ్చిమబెంగాల్ మీదుగా వీరు నేపాల్ చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వియత్నాం ద్వారా ఇండోనేషియా చేరుకోనున్నారు.
జెన్స్ జాకబ్ తన ప్రయాణంలో తాను చవిచూసిన అనుభవాలన్నింటినీ ఈ-పుస్తకాల రూపంలో www.bulliadventure24.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మరి వీరి వరల్డ్ టూర్ విజయవంతం కావాలని మనం కూడా కోరుకుందామా..!



Click it and Unblock the Notifications








