పెట్రోల్ కార్లను విడుదల చేయనున్న మహీంద్రా అండ్ మహీంద్రా
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్), ప్రస్తుతం దేశీయ విపణిలో విక్రయిస్తున్న దాదాపు అన్ని మోడళ్లను డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. అయితే, మార్కెట్లో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మార్పులను అనుసరించి, రానున్న రోజుల్లో పెట్రోల్ ఇంధనంతో నడిచే వాహనాలను కూడా ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించుకుంది.
డీజిల్ ఇంధనంపై కేంద్రం తమ నియంత్రణ తొలగించడం, అంతర్జాతీయ మార్కెట్‌ను అనుసరించి భారత్‌లో కూడా ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుండటం మరియు పెట్రోల్, డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం కూడా తగ్గుతుండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో, భారత్‌లో డీజిల్ కార్లకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో పెట్రోల్ కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.
ఇప్పటి వరకూ కేవలం డీజిల్ కార్లపై మాత్రమే దృష్టి సారించిన మహీంద్రా అండ్ మహీంద్రా, ఇకపై భవిష్యత్తులో తాము విడుదల చేయబోయే వాహనాలలో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్యాసింజర్ కార్ సెగ్మెంట్లో పెట్రోల్, డీజిల్ వేరియంట్లను సమానంగా అందిస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ (ఆటోమొబైల్, ఫార్మ్ ఎక్విప్‌మెంట్) పవన్ గోయెంకా తెలిపారు.

మహీంద్రా ఇప్పటికే 1.2 లీటర్, 1.6 లీటర్, 2.2 లీటర్ సామర్థ్యాలలో పెట్రోల్ ఇంజన్లను అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. భారత మార్కట్ కోసం మహీంద్రా అండ్ మహీంద్రా మూడు కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలను అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనంలో తెలుసుకున్నాం. ఇందులో రెండు ప్రస్తుత క్వాంటో మరియు బొలెరో ఎస్‌యూవీలకు మోడ్రన్ వెర్షన్లు కాగా మరొకటి ఓ సరికొత్త ఉత్పత్తి కానున్నట్లు సమాచారం.
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలన్నింటినీ డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కాగా.. ఫుల్ సైజ్ ఎస్‌యూవీ వాహనాలను మాత్రం డీజిల్ వేరియంట్లలోనే అందిస్తామని కంపెనీ పేర్కొన్నారు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఎస్-101 అనే కోడ్‌నేమ్‌తో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసి, టెస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఫోర్డ్, రెనో, నిస్సాన్‌లు విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








