మహీంద్రా క్వాంటోలో ఏఎమ్‌టి వెర్షన్ వస్తోంది!
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తున్న క్వాంటోలో కంపెనీ మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త మహీంద్రా క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీ పాపులర్ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.
మహీంద్రా క్వాంటో ఏఎమ్‌టి మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న క్వాంటో అమ్మకాలను ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ద్వారా పెంచుకోవాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ఏఎమ్‌టి మోడళ్ల మాదిరిగానే క్వాంటో ఏఎమ్‌టి కూడా టాప్-ఎండ్ వేరియంట్లోనే లభ్యం కానుంది.
ప్రస్తుతం దేశీయ విపణిలో మహీంద్రా క్వాంటో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ అందుబాటులో లేదు. ఇందులో అమర్చిన శక్తివంతమైన 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

అయితే, క్వాంటో ఏఎమ్‌టిలో మాగ్నెటి మారెల్లీ నుంచి గ్రహించిన 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) ఉపయోగిస్తారా లేక వేరే ఇతర కంపెనీ నుంచైనా ఏఎమ్‌టి కిట్‌ని గ్రహించి ఉపయోగిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన మహీంద్రా క్వాంటో ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం లీటరుకు 17.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.
మరి ఏఎమ్‌టితో కూడిన మహీంద్రా క్వాంటో కూడా ఇదే మైలేజీని ఆఫర్ చేస్తుందా లేక ఇంకా మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహీంద్రా క్వాంటో నాలుగు వేరియంట్లలో (సి2 సి4, సి6, సి8) లభిస్తుంది. క్వాంటో ఏఎమ్‌టి సి8 వేరియంట్లో మాత్రమే లభ్యం కావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








