ఇంజన్‌లో వాక్యూమ్ పంప్ సమస్య: స్కార్పియో, జైలో, XUV500 రీకాల్
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) 2,300 యూనిట్ల స్కార్పియో, ఎక్స్‌యూవీ500, జైలో మోడళ్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మే 2014లో తయారైన ఈ మోడళ్లలోని ఇంజన్‌లో ఉన్న లోపపూరితమైన వాక్యూమ్ పంప్‌ను సరిచేసేందుకు ఈ రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ వివరించింది.
ఇంజన్‌లోని వాక్యూమ్ పంప్‌ని తనిఖీ చేసి, అవసరమైతే ఉచితంగా రీప్లేస్ చేస్తామని, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ500, జైలో మోడళ్ల రీకాల్‌కు సంబంధించి కంపెనీ తమ కస్టమర్లను వ్యక్తిగతంగా సంప్రదిస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది.

మే 2014 నెలలో తయారైన స్కార్పియో విఎల్ఎక్స్, ఎస్ఎల్ఈ, ఎల్ఎక్స్ వేరియంట్లు, ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ4, డబ్ల్యూ6, డబ్ల్యూ8 వేరియంట్లు మరియు జైలో హెచ్9, హెచ్8, హెచ్4 వేరియంట్లు ఈ రీకాల్‌కు వర్తించనున్నాయి. వాహనాల రీకాల్ విషయంలో భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) వాలంటరీ కోడ్‌ను దృష్టిలో ఉంచుకొని తాజా రీకాల్‌ను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది.
ఈ ఏడాది జులై నెలలో లోపపూరితమైన ప్రెజర్ రెగ్యులేటింగ్ వాల్వ్‌లను సరిచేసేందుకు గాను సుమారు 23,000 యూనిట్ల స్కార్పియో వాహనాలను రీకాల్ చేసిన విషయం తెలిసినదే. జులై 2012 నుంచి వాహనాల భద్రత విషయంలో సియామ్ వాలంటరీ రీకాల్ కోడ్‌ని ప్రారంభించడంతో, మారుతి సుజుకి, మహీంద్రా, టొయోటా, ఫోర్డ్, హోండా జనరల్ మోటార్స్ వంటి పలు కంపెనీలు దేశంలో దాదాపు 7 లక్షలకు పైగా వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేయటం జరిగింది.


Click it and Unblock the Notifications








