భారత్ కన్నా ముందుగా భూటాన్ ఎలక్ట్రిక్ వెరిటో లాంచ్
ఇటీవలే ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ వెర్షన్ 'మహీంద్రా వెరిటో' త్వరలోనే రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధమైంది. మరో ఆరు నెలల సమయంలో ఇది రోడ్లపైకి రానుంది. అయితే, ముందుగా భూటాన్ దేశంలో విడుదల కానుంది. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ విషయంలో ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకునే వరకు ఇది మనకు అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది.
మంగళవారం బెంగుళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మహీంద్రా రేవా సీఈఓ చేతన్ మైనీ మాట్లాడుతూ.. వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్‌ను భూటాన్‌కు ఎగుమతి చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని, అక్కడి మార్కెట్లో ఇది టాక్సీ పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

భూటాన్ ప్రభుత్వం తమ దేశంలోని అన్ని పెట్రోల్ టాక్సీలను మరియు ప్రభుత్వ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలతో రీప్లేస్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ మరియు బూట్ స్పేస్ కలిగిన ఎలక్ట్రిక్ వెరిటో సెడాన్ ఈ విభాగానికి చక్కగా సరిపోనున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భూటాన్ సర్కారుతో మహీంద్రా చర్చలు విజయవంతమైనట్లయితే, ఈ తొలి జీరో ఎమిషన్, ప్రొడక్షన్ వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్లు ఈ ఏడాది చివరి నాటికి హిమాలయ ప్రాంతంలో కనిపించనున్నాయి.

ఇదిలా ఉండగా.. యూరోపియన్ మార్కెట్ల కోసం అభివృద్ధి చేస్తున్న మహీంద్రా ఈ2ఓ ఎలక్ట్రిక్ కారు దాదాపు తుది దశకు చేరుకుందని, ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నాటికి ఈ కారును ఎగుమతి చేసే అవకాశం ఉందని చేతన్ మైనీ తెలిపారు.


Click it and Unblock the Notifications








