మరో మైలురాయిని అధిగమించిన మహీంద్రా ఎక్స్‌యూవీ500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ గ్లోబల్ ఎస్‌యూవీ 'మహీంద్రా ఎక్స్‌యూవీ500' మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలైన రెండేళ్ల వ్యవధిలోనే 75,000 మందికి పైగా వినియోగదారులకు ఇది చేరువ అయింది. మహీంద్రా తొలిసారిగా సెప్టెంబర్ 2011లో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని కంపెనీ పూర్తిగా చెన్నైలోని ఆర్ అండ్ డి కేంద్రంలో డిజైన్ చేసింది. ప్రపంచ స్థాయి డిజైన్, అధునాతన టెక్నాలజీ, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ, ఆరంభం నుంచే అభిమానులను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి, మహీంద్రా నుంచి ఇంత స్టయిలిష్ స్పోర్టీ ఎస్‌యూవీ గతంలో ఎన్నడూ రాలేదు.

ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లోనే కాకుండా, దక్షిణాఫ్రికా, నేపాల్ వంటి దేశాల్లో కూడా అమ్ముడవుతోంది. స్టయిలిష్ డిజైన్, శక్తివంతమైన ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్, విలాసవంతమైన ఫీచర్స్ అన్నింటికన్నా మించి ఆకర్షనీయమైన ధరతో ఇది కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ప్రారంభంలో మహీంద్రా ఎక్స్‌యూవీ500 కేవలం మూడు వేరియంట్లలో (డబ్ల్యూ6 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఫ్రంట్ వీల్ డ్రైవ్, డబ్ల్యూ8 ఆల్ వీల్ డ్రైవ్) మాత్రమే లభ్యమయ్యేది.
అయితే, ఈ మోడల్‌కు పెరుగుతున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఇందులో డబ్ల్యూ4 అనే ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను గడచిన నవంబర్ నెలలో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








