ఉత్పత్తుల ధరలను పెంచిన మహీంద్రా, టాటా మోటార్స్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ వాహనాల ధరలను 1-2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో, ధరలు పెంచాల్సి వచ్చిందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి.
తాజా పెంపుతో మహీంద్రా అందిస్తున్న ప్యాసింజర్, వాణిజ్య వాహనాల ధరలు మోడల్‌ను బట్టి రూ.2,300 నుంచి రూ.11,500 వరకు (ఎక్స్-షోరూమ్ ధరపై) పెరగగా, ట్రాక్టర్ల ధరలు రూ.6,000 నుంచి రూ.10,000 వరకూ పెరిగాయి.

గత కొంత కాలంగా ధరల పెంపును వాయిదా వేస్తూ వస్తున్నామని, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని పాక్షికంగా తట్టుకునేందుకు ధరలను పెంచక తప్పడం లేదని, తాజా ధరల పెరుగుదల ఈ నెల నుంచే వర్తిస్తుందని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్) ప్రవీణ్ షా తెలిపారు.
కాగా.. టాటా మోటార్స్ గడచిన అక్టోబర్, నవంబర్ నెల నుంచే వాణిజ్య వాహనాల ధరలను 1-2 శాతం వరకు పెంచామని, ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.


Click it and Unblock the Notifications








