మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలు
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) పెద్ద ఎస్‌యూవీల నుంచి చిన్న ఎస్‌యూవీల తయారీపై దృష్టి మళ్లించింది. ప్రస్తుతం మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసినదే. ఈ రకం ఎస్‌యూవీలకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది.
కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో వచ్చిన రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వంటి మోడళ్లు ఇప్పటికే మంచి విజయాన్ని సాధించాయి. ఈ నేపథ్యంలో, మహీంద్రా కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తోంది.
వాస్తవానికి మహీంద్రా అండ్ మహీంద్రా ఈ సెగ్మెంట్లో తమ క్వాంటో కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసినప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవటంలో ఈ మోడల్ విజయవంతం కాలేదనే చెప్పాలి. అందుకే, మహీంద్రా ఇప్పుడు ఈ సెగ్మెంట్ కోసం మూడు సరికొత్త ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది.

ఇందులో రెండు ప్రస్తుత క్వాంటో మరియు బొలెరో ఎస్‌యూవీలకు మోడ్రన్ వెర్షన్లు కాగా మరొకటి సరికొత్త ఉత్పత్తి కానున్నట్లు సమాచారం. ప్రస్తుత సాంప్రదాయ డిజైన్లకు గుడ్‌బై చెబుతూ వచ్చిన ఎక్స్‌యూవీ500 తరాహాలోనే మహీంద్రా మోడ్రన్ డిజైన్‌తో కూడిన ఓ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మహీంద్రా నుంచి అందుబాటులోకి రానున్న సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే కాకుండా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. మరో రెండేళ్లలో ఈ సరికొత్త మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌యూవీ మన ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పటికే ఎస్-101 అనే కోడ్‌నేమ్‌తో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసి, టెస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసినదే. ఫోర్డ్, రెనో, నిస్సాన్‌లు విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ధీటుగా మహీంద్రా తమ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది.
మహీంద్రా ప్రవేశపెట్టనున్న మూడు కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ముందుగా ఎస్-101 మోడల్ మార్కెట్లోకి రానుంది. దాని తర్వాత క్వాంటో, బొలెరో ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు విడుదల కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








