డిసెంబర్‌లో 4 శాతం తగ్గిన మారుతి సుజుకి సేల్స్
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియాకు కొత్త సంవత్సరం అయినా కలిసొస్తుందో లేదో చూడాలి. గడచిన డిసెంబర్ నెలలో కూడా మారుతి సుజుకి అమ్మకాలు నేలవైపే చూస్తున్నాయి. డిసెంబర్ 2012తో పోల్చుకుంటే, డిసెంబర్ 2013లో కంపెనీ మొత్తం అమ్మకాలు 4.4 శాతం క్షీణించి 95,145 యూనిట్ల నుంచి 90,924 యూనిట్లకు పడిపోయాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే, ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 5.5 శాతం వృద్ధి చెంది 82,073 యూనిట్ల నుంచి 86,613 యూనిట్లకు పెరిగాయి. ఎమ్800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్ఆర్ వంటి మినీ కార్ల అమ్మకాలు 16.7 శాతం పెరిగి 32,797 యూనిట్ల నుంచి 38,286 యూనిట్లకు వృద్ధి చెందాయి.

కాన, స్విఫ్ట్, ఎస్టిలో, రిస్జ్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 14.7 శాతం క్షీణించి 22,482 యూనిట్ల నుంచి 19,171 యూనిట్లకు పడిపోయాయి. ఇదే సమయంలో డిజైర్ అమ్మకాలు 18 శాతం వృద్ధి చెంది 13,076 యూనిట్ల నుంచి 15,427 యూనిట్లకు పెరిగాయి.
అయితే, ఎస్ఎక్స్4 అమ్మకాలు మాత్రం 17.6 శాతం క్షీణించి 329 యూనిట్ల నుంచి 271 యూనిట్లకు పడిపోయాయి. ఎర్టిగా, గ్రాండ్ విటారా, జిప్సీ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు 5.5 శాతం క్షీణించి 5,447 యూనిట్ల నుంచి 5,146 యూనిట్లకు పడిపోయాయి. ఓమ్నీ, ఈకో వ్యాన్‌ల అమ్మకాలు 5.3 శాతం పెరిగి 7,897 యూనిట్ల నుంచి 8,312 యూనిట్లకు పెరిగాయని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








