జూన్‌లో 31 శాతం పెరిగిన మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు
మారుతి సుజుకి ఇండియాకు మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తోంది. గత కొద్ది నెలలుగా ప్రతికూల అమ్మకాలను నమోదు చేసుకుంటూ వచ్చిన దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ, గడచిన జూన్ నెలలో మాత్రం సానుకూల అమ్మకాలను నమోదు చేసుకుంది.
జూన్ 2014లో మారుతి సుజుకి ఇండియా మొత్తం అమ్మకాలు 33.5 శాతం వృద్ధిని సాధించి 1.12 లక్షల యూనిట్లుగా నమోదైనట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా, ఆల్టో, సెలెరియో, రిట్జ్, వ్యాగన్ఆర్, డిజైర్, స్విఫ్ట్ మోడళ్ల అమ్మకాలు జోరుగా సాగాయి.
ఈ సమయంలో కంపెనీ దేశీయ అమ్మకాలు 31.1 శాతం వృద్ధి చెంది 1 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఎగుమతులు 58.4 శాతం పెరిగి 11,809 యూనిట్లుగా రికార్డ్ కాగా, యుటిలిటీ వాహనాల అమ్మకాలు 0.1 శాతం పెరిగి 5003 యూనిట్లుగా నమోదైనట్లు మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది.

ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 32.3 శాతం వృద్ధిని సాధించగా అందులో 27.4 శాతం వాటా స్విఫ్ట్ డిజైర్ వాహనాలే అమ్ముడయ్యాయి. ఆల్టో, ఎ-స్టార్, వ్యాగన్ఆర్ అమ్మకాలు 52.1 శాతం వృద్ధిని, స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, సెలెరియో అమ్మకాలు 6.2 శాతం వృద్ధిని చూపాయని కంపెనీ తెలిపింది.
గడచిన జూన్ నెలలో వ్యాగన్ఆర్, సెలెరియో కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సమయంలో కంపెనీ దాదాపుగా 17,000 వ్యాగన్ఆర్ కార్లను, 5,000 యూనిట్ల సెలెరియో కార్లను విక్రయించింది. ఓమ్నీ, ఈకో వంటి వ్యాన్‌ల అమ్మకాలు 42.5 శాతం వృద్ధిని సాధించి 9,738 యూనిట్లుగా నమోదయ్యాయి.


Click it and Unblock the Notifications








