మారుతి సుజుకి ఎల్‌సివి విక్రయాల కోసం ప్రత్యేక సేల్స్ నెట్‌వర్క్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ), ఓ తేలికపాటి వాణిజ్య వాహనాన్ని (ఎల్‌సివి) అభివృద్ధి చేస్తున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో చదువుకున్నాం. వచ్చే ఏడాదిలో మార్కెట్లోకి రానున్న ఈ మారుతి ఎల్‌సివి (లైట్ కమర్షియల్ వెహికల్) విక్రయాల కోసం కంపెనీ ప్రత్యేకంగా సేల్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కి చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అందిస్తున్న 'క్యారీ' (Carry) ఎల్‌సివి ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త ఎల్‌సివి అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే మారుతి సుజుకి ఈ ఎల్‌సివిని 'వై9టి' (Y9T) అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తోంది. కాగా.. మారుతి సుజుకి తమ కొత్త ఎల్‌సివికి ఇంకా ఓ పేరును ఖరారు చేయలేదు.
క్యారీ పేరుతోనే ఈ కొత్త ఎల్‌సివిని విక్రయిస్తుందా లేక వేరే పేరును ప్రతిపాదిస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది. మారుతి సుజుకి తమ ఎల్‌సివిలో తాజాగా అభివృద్ధి చేసిన 0.8 లీటర్ ట్విన్ సిలిండర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్‌ను సుజుకి జపాన్‌లో అభివృద్ధి చేస్తోంది. మారుతి వై9టి ఎల్‌సివిలో ఉపయోగించడానికి ముందుగా దీనిని అక్కడే టెస్ట్ చేసి, రిలీజ్ చేయనున్నారు.

మారుతి సుజుకి వై9టి ఎల్‌సివి కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తోనే కాకుండా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగిన సిఎన్‌జి వేరియంట్లో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. ఈ ఎల్‌సివి జపాన్‌లోని సుజుకి క్యారీ మోడల్ ఆధారంగా చేసుకొని తయారు చేస్తుప్పటికీ, ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా దీనిని డిజైన్ చేయనున్నారు. దీనిని గుర్గావ్ ప్లాంటులో ఉత్పత్తి చేయనున్నారు.
డీజిల్ వెర్షన్ ధర రూ.4 లక్షల రేంజ్‌లో, సిఎన్‌జి వెర్షన్ ధర రూ.4.5-5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో ప్రధానంగా టాటా ఏస్‌కు పోటీగా నిలువనుంది. అలాగే మహీంద్రా జియో, పియాజ్జియో ఆపే ట్రక్, అశోక్ లేలాండా దోస్త్, ఫోర్స్ మోటార్స్ ట్రంప్ వంటి మోడళ్లకు సైతం పోటీ ఇవ్వనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








