మినీ సిటీ సర్ఫర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూకి చెందిన ప్రీమియం స్మాల్ కార్ బ్రాండ్ మినీ ఓ కొత్త టూవీలర్ కాన్సెప్ట్‌ని ఆవిష్కరించింది. మినీ సిటీ సర్ఫర్ పేరిట ఆవిష్కరించిన ఈ కాన్సెప్ట్ ఓ ఫోల్డబిల్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఫ్యూచర్ అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశారు.
చిన్నపాటి దూరాలను సులువుగా చేరుకునేందుకు వీలుగా మినీ తమ సిటీ సర్ఫర్‌ను తయారు చేసింది. అంతేకాకుండా, దీని కాంపాక్ట్ డిజైన్, ఫోల్డింగ్ ఆప్షన్ కారణంగా ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. తమ కారు బూట్ స్పేస్‌లోనే ఇమిడిపోయేలా ఈ సిటీ సర్ఫర్‌ను డిజైన్ చేశారు.

మినీ సిటీ సర్ఫర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇందులో ఓ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ బ్యాటరీలను 12-వోల్ పవర్ సాకెట్‌తో చార్జ్ చేసుకోవచ్చు. ఇందులో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ స్కూటర్ నడుపుతున్నప్పుడు బ్రేక్ వేసిన ప్రతిసారి, బ్యాటరీలు చార్జ్ అవుతుంటాయి.
మినీ సిటీ సర్ఫర్‌ను పూర్తిగా చార్జ్ చేసుకుంటే 15-25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. వెనుక చక్రంలో ఉండే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ పవర్‍ను గ్రహించి స్కూటర్‌ను ముందుకు నడిచేలా చేస్తుంది. ఇందులో లైట్స్, బ్రేక్స్ కూడా ఉంటాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు కేవలం 18 కిలోలు మాత్రమే. మినీ అందిస్తున్న 3-డోర్ కారులో బూట్ స్పేస్‌లో సిటీ సర్ఫర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చక్కగా ఇమిడిపోతుంది. వాహనం (కారు) నుంచి ఆఫీసుకి, పార్క్‌కి లేదా ఇతర చిన్నపాటి దూరాలకు ఉపయోగపడేలా ఈ సిటీ సర్ఫర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేశారు.



Click it and Unblock the Notifications








