మిత్సుబిషి మిరాజ్, అట్రాజ్ కార్లు ఇండియాకు వస్తున్నాయ్!
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి, 2016 నాటికి భారత మార్కెట్లో మొత్తం 5 కొత్త మోడళ్లను విడుదల చేస్తామని గతంలో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఈ ఐదు మోడళ్లలో ముందుగా ఓ హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ మోడళ్లు మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.
మిత్సుబిషి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన మిరాజ్ హ్యాచ్‌బ్యాక్, అట్రాజ్ సెడాన్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడళ్ల ద్వారా మాస్ మార్కెట్లో మంచి పట్టును సాధించగమలని మిత్సుబిషి ఇండియా ధీమాగా ఉంది.

మిత్సుబిషి ప్రస్తుతం భారత్‌లోని హిందుస్థాన్ మోటార్స్‌తో కలిసి ఇక్కడి మార్కెట్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ ఒప్పందం 2015లో ముగియనుంది. ఇది ముగిసిన తర్వాత, మిత్సుబిషి ఇండియన్ మార్కెట్ కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకోనుంది.
మిత్సుబిషి మిరాజ్ మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఫోక్స్‌వ్యాగన్ పోలో వంటి మోడళ్లకు పోటూగా నిలుస్తుంది. అలాగే మిత్సుబిషి అట్రాజ్ ఈ సెగ్మెంట్లోని టొయోటా ఎతియోస్, నిస్సాన్ సన్నీ, మారుతి సుజుకి సియాజ్ వంటి మోడళ్లకు ధీటుగా ఉంటుంది.

మిత్సుబిషి మిరాజ్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 77 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న మిరాజ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా, సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో పాటుగా లభ్యమవుతుంది.
అట్రాజ్ సెడాన్‌ను మిత్సుబిషి మిరాజ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. మిరాజ్‌లోని ఇంజన్‌నే ఇందులోను ఉపయోగిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లలో ఇవి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఇందులో డీజిల్ ఆప్షన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








