మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ ఆటోమేటిక్ లాంచ్ ఖరారు!
జపనీస్ కార్ కంపెనీ మిత్సుబిషి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాజెరో స్పోర్ట్ ప్రీమియం ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఓ టీజర్ ఫొటోను, కౌంట్‌డౌన్ టైమర్‌ను విడుదల చేసింది.
ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, మిత్సుబిషి తమ కొత్త పాజెరో స్పోర్ట్ మోడల్‌ను నవంబర్ 15, 2014వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న పాజెరో స్పోర్ట్ ఫోర్-వీల్ డ్రైవ్ (4x4), మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. కాగా.. కొత్తగా విడుదల చేయనున్నది టూ-వీల్ డ్రైవ్ (4x2), ఆటోమేటిక్ వెర్షన్ పాజెరో స్పోర్ట్.

మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ఆటోమేటిక్ వేరియంట్‌లో కూడా ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడల్‌లో ఉపయోగిస్తున్న 2.5 లీటర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించవచ్చని అంచనా. ఈ ఇంజన్ గరిష్టంగా 178 పిఎస్‌ల శక్తిని, 400 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్‌లో 4x4 పాజెరో స్పోర్ట్‌లో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగిస్తున్నారు. కాగా.. 4x2 పాజెరో స్పోర్ట్‌లో 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు.
ఈ కొత్త వేరియంట్ మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ధర, ఫోర్-వీల్ డ్రైవ్ మ్యాన్యువల్ పాజెరో స్పార్ట్ ధర కన్నా తక్కువగా ఉండనుంది. ప్రస్తుత మోడల్‌లో (4x4లో) లభిస్తున్న దాదాపు అన్ని ఫీచర్లను ఈ కొత్త మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ (4x2)లో కూడా కొనసాగించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం దేశీయ విపణిలో మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x4 మ్యాన్యువల్ ధర రూ.23.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ నేపథ్యంలో, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ 4x2 ధర రూ.20 లక్షలకు ఎగువన ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








