నానో ఏఎమ్‌టి మరియు నానో ట్విస్ట్ యాక్టివ్ వేరియంట్స్
ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా చరిత్ర సృష్టించ టాటా మోటార్స్ వారి ప్రజల కారు 'టాటా నానో' త్వరలోనే మరిన్ని కొత్త వేరియంట్లలో లబ్యం కానుంది. రేపటి (ఫిబ్రవరి 5, 2014) నుంచి ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2014లో టాటా మోటార్స్ తమ నానోలో మరిన్ని కొత్త వేరియంట్లను పరిచయం చేయనుంది.
టాటా మోటార్స్ ఆవిష్కరించనున్న కొత్త వేరియంట్లలో ఒకటి, ఓపెనింగ్ టెయిల్ గేట్ (వెనుక (బూట్) డోర్ ఓపెన్) అయ్యే 'టాటా నానో ట్విస్ట్ యాక్టివ్'. టాటా నానో కారును 2009లో విడుదల చేసినప్పటి నుంచి కంపెనీ, ఇందులో వెనుక బూట్ డోర్ ఓపెన్ చేసేలా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. కాగా, ఇప్పుడు ఇది వాస్తవ రూపం దాల్చనుంది.

టాటా నానో విషయంలో వెనుక లగేజ్ స్పేస్‌ను యాక్సెస్ చేసుకునేందుకు ఇబ్బందిగా ఉందని అనేక కస్టమర్ల నుంచి ఫిర్యాదులు రావటంతో టాటా ఈ అప్‌గ్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కస్టమర్లకు కూడా ఈ అప్‌గ్రేడ్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది. అయితే, ఓపెనింగ్ టెయిల్ గేట్ వలన నానో బరువు అదనంగా మరో 70-80 కేజీలు పెరిగే ఆస్కారం ఉంది. ఫలితంగా మైలేజ్ కూడా తగ్గొచ్చు.
ఇకపోతే రెండవ వేరియంట్ టాటా నానో ఏఎమ్‌టి లేదా ఆమేటిక్ వేరియంట్. ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్. మ్యాన్యువల్ గేర్ బాక్స్ మైలేజీతో ఆటోమేటిక్ గేర్ బాక్స్ సౌకర్యాన్ని ఆఫర్ చేయటం ఈ ఏఎమ్‌టి ప్రత్యేకత. అంతేకాదు, పూర్తి ఆటోమేటిక్ కారు కన్నా దీని ధర కూడా తక్కువే.

ఈ ఆటోమేటిక్ నానో వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే, ఇదే ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన ఆటోమేటిక్ కారుగా మరో రికార్డు సృష్టించనుంది. అయితే, ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టాటా నానో డీజిల్ మాత్రం, ఇప్పట్లో కనిపించే అవకాశాల్లేనట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








