నగరం దుర్ఘటన; హైదరాబాద్‌లో సీఎన్‌జీ సరఫరా బంద్!
హైదరాబాద్: హైదరాబాద్‌లో సీఎన్‌జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఇంధన కొరత ఏర్పడింది. గడచిన మంగళవారం నుంచి నగరంలో సీఎన్‌జీ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో సీఎన్‌జీ సరఫరా ఆగిపోయిందని రవాణా శాఖ వర్గాలు తెలిపాయి. ఆ పైప్‌లైన్ పునరుద్ధరణ తరువాతే సీఎన్‌జీ సరఫరా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయతే, మరో నాలుగు రోజుల్లో సీఎన్‌జీ స్టాక్ రావచ్చని వాటిని నిర్వహించే పెట్రోల్ బంకుల యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలోని మొత్తం 10 పెట్రోల్ బంకుల ద్వారా సీఎన్‌జీ సప్లయ్ అవుతోంది. సీఎన్‌జీ సరఫరా నిలిచిపోవడంతో, ఆ ఇంధనంతో నడిచే అనేక వాహనాలు రోడ్డెక్కడం మానేశాయి. సీఎన్‌జీ ఇంధనాన్ని ఎక్కువగా ఆటోరిక్షాలలో, పెట్రోల్-సీఎన్‌జీ కార్లలో ఉపయోగిస్తుంటారు.

హైదరాబాద్‌లో దాదాపు 35,000 ఆటోరిక్షాలు సీఎన్‌జీతో నడిచేవే. దీంతో సదరు ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. నగరంలోని ఆర్‌పీ రోడ్, నారాయణగూడ, నింబోలి అడ్డా, ఎల్బీనగర్‌లోనీ ఎన్టీఆర్ నగర్, వనస్థలిపురం, బాలానగర్, బాలాపూర్, లంగర్‌హౌజ్, జుమ్మెరాత్‌బజార్, జూపార్క్ ప్రాంతాల్లోని సీఎన్‌జీ బంకుల నిర్వాహకులు ‘నో స్టాక్' బోర్డులు పెట్టేశారు.
సీఎన్‌జీ గ్యాస్‌పై నగరం, శివారు ప్రాంతాల్లో వేలాది ఆటోలు, రెండు వందల ఆర్టీసీ బస్సులు, 4500 కార్లు, 50కి పైగా క్యాబ్‌లు నడుస్తున్నాయి. వరంగల్, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లో కూడా సీఎన్‌జీ కొరత తప్పదని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. సీఎన్‌జీ ఆటోలపైనే జీవనాధారం సాగించే ఆటో డ్రైవర్లు ఇప్పుడు రోడ్డుపాలయ్యారు. సీఎన్‌జీ గ్యాస్ పునరుద్ధరణ జరిగే వరకు తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. అప్పటి వరకు ప్రభుత్వమే తమని ఆదుకోవాలని ఆటో డ్రైవర్ల సంఘం ప్రతినిధి కిరణ్ డిమాండ్ చేశారు.


Click it and Unblock the Notifications








