ఈ వీడియో చూసిన తర్వాత కూడా డాట్సన్ గోని కొంటారా?
నేటి ఆధునిక ప్రపంచంలో వాహనాల విషయంలో భద్రత పెద్ద సమస్యగా పరిణమిస్తున్న నేపథ్యంలో, సేఫ్టీ నిబంధనలు కూడా మరింత కఠినతరం అవుతున్నాయి. ఇందుకు చక్కటి ఉదాహరనే, గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ఇటీవల నిర్వహించిన మేడ్ ఇన్ ఇండియా మారుతి స్విఫ్ట్, డాట్సన్ గో క్రాష్ టెస్ట్. ఈ టెస్టులో ఈ రెండు మోడళ్లు కూడా సేఫ్టీలో జీరో రేటింగ్‌ను పొందాయి.
ఇందుకు ప్రధాన కారణంగా, ఆయా కార్లలో కనీస భద్రతా ఫీచర్లు లేకపోవటమే. ఈ టెస్ట్‌లో మారుతి స్విఫ్ట్ కన్నా డాట్సన్ గో మరీ ఘోరంగా విఫలమైంది. దీని బాడీ నిర్మాణంలో అస్సలు నాణ్యత లేదని గ్లోబల్ ఎన్‌సిఏపి సర్టిఫై చేసింది. ఇలాంటి కారులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఎయిర్‌బ్యాగ్ వంటి ప్రాథమిక భద్రతా ఫీచర్లు ఆఫర్ చేసినప్పటికీ, దీని నాసిరకం నిర్మాణం కారణంగా ఈ కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులోని ప్రయాణీకుల భద్రతకు భరోసా ఉండదని స్పష్టం చేసింది.
ఈ క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ తర్వాత గ్లోబల్ ఎన్‌సిఏపి చైర్మన్ మాక్స్ మోస్లీ, నిస్సాన్ సీఈఓ కార్లోస్ ఘోస్న్‌కు ఓ పర్సనల్ లెటర్ పంపించారు. ఆ లెటర్‌లో, డాట్సన్ గో ప్రాథమిక భద్రతా పరీక్షలలో విఫలమైన కారణంగా, ఈ మోడల్‌ను తక్షణమే భారత మార్కెట్ నుంచి తొలగించాలని కార్లోస్ ఘోస్న్‌ను మాక్స్ మోస్లీ కోరారు. ఆయన అలా అనడం వెనుక దాగి ఉన్న బలమైన కారణం ఏంటో తెలియాలంటే, మీరు కూడా ఈ డాట్సన్ గో క్రాష్ టెస్ట్ వీడియోని చూడాల్సిందే.
డాట్సన్ గో కారును గ్లోబల్ ఎన్‌సిఏపి నిబంధనలకు లోబడి క్రాష్ చేసినప్పుడు, అందులోని ప్రయాణీకులకు జరిగే ప్రమాదాన్ని డమ్మీల రూపంలో వివరించారు. వివిధ కెమెరా యాంగిల్స్ నుంచి చిత్రీకరించిన ఈ క్రాష్ టెస్ట్ వీడియోని మీరు కూడా చూసేయండి. మరి ఈ వీడియో చూసిన తర్వాత డాట్సన్ గో కారును కొనుగోలు చేయాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి..!


Click it and Unblock the Notifications








