స్వాతంత్ర్య దినోత్సవం నాడు పెట్రోల్ ధరల తగ్గింపు
స్వాతంత్ర్య దినోత్సవం నాడు పెట్రోల్ ధరకు కూడా స్వాతంత్ర్యం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఆరంభంలో లీటరుకు రూ.1.09 పైసల మేర పెట్రోల్ ధరను తగ్గించిన చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్ ధరను తగ్గించేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈసారిగా ఏకంగా లీటరుపై రూ.2.50 పైసల వరకు ధర తగ్గవచ్చని చమురు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: టాటా జెస్ట్ విడుదల
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 105 డాలర్ల నుంచి దిగొచ్చి 104 డాలర్లకు సమీపంలో చేరింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్ ధరలో తగ్గింపును విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గిన కారణంగా భారత్‌లో పెట్రోలు విక్రయంపై చమురు కంపెనీలు లభాలను ఆర్జిస్తున్నాయి. ఈ లాభాలను వీలైనంత వరకు వినియోగదారులకే బదిలీ చేస్తామని చమురు కంపెనీలు చెబుతున్నాయి.

పెట్రోల్ ధరలకు స్వేచ్ఛ కల్పించినప్పటి నుంచి ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ప్రతినెలలో పక్షం రోజులకు ఒక్కసారి చొప్పున (ప్రతినెలా 1, 15వ తేదీలలో) ధరలపై సమీక్ష నిర్వహించి, పెట్రోల్ ధరను పెంచడం లేదా తగ్గించడంపై నిర్ణయం తీసుకుంటాయి. ఇందులో భాగంగానే, ఆగస్ట్ 15న చమురు ధరలపై సమీక్ష నిర్వహించి, అంతర్జాతీయ మార్కెట్లో ఈ ట్రెండ్ ఇలానే కొనసాగినట్లయితే పెట్రోల్ ధరను తగ్గించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎలైట్ ఐ20 విడుదల
కాగా.. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని సమాచారం. పైపెచ్చు ప్రతినెలా డీజిల్ ధరను పెంచుతున్నట్లుగానే ఈసారి కూడా డీజిల్ ధరను 50 పైసలు పెంచడం జరవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications