గంజాయి పెంపకం కోసం లగ్జరీ కార్ల ఎల్ఈడి లైట్లు చోరీ!
దొంగలు రోజుకో కొత్త ఎత్తుగడలు నేర్చుకుంటున్నారు. ఇప్పటి వరకు కార్ల దొంగతనం గురించి ఫిర్యాదులు రావటాన్ని మనం గమనించాం. కానీ తాజాగా.. కొందరు దొంగలు కార్ల హెడ్‌లైట్లను చోరీ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
యునైటెడ్ కింగ్డమ్‌లోని కొందరు దొంగల ముఠా హై-ఎండ్ లగ్జరీ కార్లను (ప్రత్యేకించి ల్యాండ్ రోవర్ మోడళ్లను) టార్గెట్ చేసుకొని, వాటి ఎల్ఈడి హెడ్‌లైట్లను, డేటైమ్ రన్నింగ్ లైట్లను చోరీ చేస్తున్నారు. ఇలా చోరీ చేసిన లైట్లను డ్రగ్స్ ముఠాలకు విక్రయిస్తున్నారట.
కన్నాబిస్ (గంజాయి) మొక్కలను ఇండోర్‌లో పెంచడం కోసం డ్రగ్ మాఫియా ఈ లైట్లను ఉపయోగిస్తుంది. గంజాయి మొక్కలు సూర్యరశ్మిలోనే పెరుగుతాయి కాబట్టి, వీటిని ఇండోర్‌లో పెంచేటప్పుడు వాటిపై సూర్యరశ్మి పడే అవకాశం ఉండదు.

ఈ నేపథ్యంలో, సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా ఈ ఎల్ఈడి లైట్లను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, ఇవి రెగ్యులర్ ఫిలమెంట్ బల్బులతో పోల్చుకుంటే, మరింత ఎక్కువ విద్యుత్‌ను కూడా ఆదా చేస్తుండటంతో డ్రగ్ మాఫియా వీటిపై కన్నేసినట్లు సమాచారం.
ఎల్ఈడి లైట్ల కోసం ప్రత్యేకించి రేంజ్ రోవర్ మోడళ్లనే టార్గెట్ చేయటం వెనుక ఓ బలమైన కారణం కూడా ఉంది. అదేంటంటే, ఇతర వాహనాలతో పోల్చుకుంటే రేంజ్ రోవర్ ఎల్ఈడి లైట్లను చోరీ చేయటం చాలా సులువని అక్కడి పోలీసులు చెబుతున్నారు.
బాగా నైపుణ్యం కలిగి ఓ దొంగ కేవలం ఒక్క నిమిషంలోనే ఈ లైట్లను తొలిగించగలడని వారు తెలిపారు. కేవలం గంజాయి పెంపకం కోసమే కాకుండా, కొందరు దొంగలు ఖరీదైన కార్లలోని కొన్ని విడిభాగాలను దొంగిలించి, తిరిగి వాటినే స్పేర్ పార్ట్స్‌గా విక్రయిస్తున్నారట.


Click it and Unblock the Notifications








