అక్టోబర్‌లో ఆల్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్ ఎస్‌యూవీ విడుదల!
రెనో ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న పవర్‌ఫుల్, స్టయిలిష్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'రెనో డస్టర్'లో కంపెనీ త్వరలోనే ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్న తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, ఫోర్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్‌ను అక్టోబర్ నాటికి మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి రెనో ఇండియా ఇప్పటికే తమ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ డస్టర్ ఎస్‌యూవీని చెన్నైలోని ఓరగడం వద్ద ఉన్న రెనో-నిస్సాన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన ఫోర్-వీల్ డ్రైవ్ డస్టర్‌ను డాసియా బ్యాడ్జ్‌తో యూరప్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. రెనో ఇండియా తొలిసారిగా తమ డస్టర్ ఎస్‌యూవీని 2012లో భారత మార్కెట్లో విడుదల చేసింది.
ప్రస్తుతం భారత మార్కెట్లో రెనో డస్టర్ కేవలం టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. కాగా.. ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన డస్టర్‌ను 110పిఎస్ డీజిల్ వేరియంట్లో మాత్రమే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ వేరియంట్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభ్యం కానుంది. ప్రస్తుతానికి రెనో ఆటోమేటిక్ వేరియంట్ డస్టర్ గురించి ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, భవిష్యత్తులో ఈ వేరియంట్ విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

కాగా.. రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్లో ఉపయోగించనున్న ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను తమ భాగస్వామి కంపెనీ నిస్సాన్ అందిస్తున్న ఎక్స్-ట్రైల్ ఎస్‍యూవీ నుంచి గ్రహించనున్నారు. అదే తరహా ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను డస్టర్‌లోను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రెనో డస్టర్ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ మార్కెట్లో విడుదలైతే, ఆ తర్వాత కొద్ది రోజులకే నిస్సాన్ టెర్రానో కూడా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
నిజానికి, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండే ఎస్‌యూవీలను నడపటంలో ఎంతో ఫన్ ఉంటుంది. రెగ్యులర్ టూ-వీల్ (4x2) డ్రైవ్ కార్లలో ఇంజన్ నుంచి వచ్చే శక్తి ముందు చక్రాలకు కానీ లేదా వెనుక చక్రాలకు (సూపర్ కార్లలో) కానీ బదిలీ అవుతుంటుంది. అయితే, ఫోర్-వీల్ (4x4) డ్రైవ్ మాత్రం ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా బదిలీ అవుతుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న రెనో డస్టర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్, డీజిల్ వేరియంట్‌లో 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5లీటర్ డిసిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. పెట్రోల్ వేరియంట్ లీటరుకు 13.24 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్స్ లీటరుకు (85 పిఎస్ వెర్షన్) 20.45 కి.మీ. మైలేజీని, (110 పిఎస్ డీజిల్) 19.01 కి.మీ. మైలేజీనిస్తాయి.


Click it and Unblock the Notifications








