జనవరి నుంచి ప్రియం కానున్న రెనో కార్ల ధరలు
కొత్త సంవత్సరంలో కార్ల ధరలను పెంచనున్న కంపెనీల జాబితాలో తాజాగా ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా వచ్చి చేరింది. జనవరి 2015 నుంచి తమ కార్ల ధరలను 2.5 శాతం వరకు పెంచనున్నట్లు రెనో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటి వరకూ పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని తామో భరిస్తూ వచ్చామని, కాకపోతే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల వలన ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని రెనో ఇండియా వైస్-ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రఫయెల్ ట్రెగ్యూర్ తెలిపారు.
భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమకు పూర్వవైభవం కల్పించేందుకు గాను కొత్త వ్యాపారా విధానాల కోసం ఆటోమొబైల్ పరిశ్రమ ఎదురుచూస్తోందని ఆయన అన్నారు. ప్రస్తుతం రెనో ఇండియా దేశీయ విపణిలో పల్స్, స్కాలా, డస్టర్, ఫ్లూయెన్స్, కొలియోస్ మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్లో వీటి ధరలు రూ.4.46 లక్షల నుంచి రూ.25.99 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

గడచిన వారంలో నిస్సాన్ ఇండియా తమ కార్ల ధరలను, అలాగే డాట్సన్ కార్ల ధరలను రూ.18,000 వరకూ పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇప్పటికే, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలతో పాటుగా బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ మేకర్లు కూడా జనవరిలో ధరలను పెంచనున్నట్లు ప్రకటించాయి.


Click it and Unblock the Notifications








