రెనో ఇండియా నుంచి 800సీసీ స్మాల్ కార్!
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో భారత మార్కెట్ కోసం 800సీసీ ఇంజన్ కలిగిన ఓ బడ్జెట్ కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ కారును విడుదల చేయాలని రెనో యోచిస్తోంది. ఈ బుజ్జి కారు తొలుతగా భారత మార్కెట్లో విడుదల కానుంది. ఆ తర్వాత దీనిని బ్రెజిల్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో విడుదల చేయనున్నారు.
రెనో నిస్సాన్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న చెన్నై ప్లాంటులోనే ఈ కారు జీవం పోసుకోనుంది. ఇప్పటికే చిన్న కార్ల తయారీ కోసం ఈ ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన కామన్ మాడ్యూల్ ఫ్యామిలీ ప్లాట్‌ఫామ్‌పై ఈ చవక కారు రూపుదిద్దుకోనుంది. భారత మార్కెట్లో ఈ కారును రూ.4 లక్షల కన్నా తక్కువ ధరకే అందించేలా రెనో చర్యలు తీసుకోనుంది.

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అమ్ముడయ్యే మొత్తం కార్లలో ఈ శ్రేణి కార్ల వాటా దాదాపు 40 శాతం పైగానే ఉంది. తాము అభివృద్ధి చేస్తున్న ఈ చిన్న కారును 2015 మధ్యకాలంలో విడుదల చేస్తున్నట్టు రెనో ఇండియా సీఈవో, ఎండీ సుమిత్ సాహ్నీ వెల్లడించారు. దీని ఇంజన్ సామర్థ్యాన్ని వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
కాగా.. కంపెనీ ప్రకటించిన రూ.4 లక్షలలోపు కారు మరియు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న 800సీసీ కారు రెండూ ఒకటేనా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా వృద్ధి చెందుతున్న మల్టీ యుటిలిటీ వెహికల్ (ఎమ్‌యూవీ) సెగ్మెంట్లో కూడా ఓ కొత్త ఉత్పత్తిని (బహుశా ప్రస్తుతం రెనో గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న లాడ్జీ ఎమ్‌పివిని) కూడా రెనో ఇండియా విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








