రెనో ఇండియా నుంచి ఓ కొత్త ఎమ్‌పివి, మరో స్మాల్ కార్
రెనో ఇండియా వచ్చే ఏడాది భారత మార్కెట్లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయటం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ రెండు కొత్త ఉత్పత్తులలో ఓ మల్టీ పర్పస్ వెహికల్ (ఎమ్‌పివి) మరో చిన్న కారు (బడ్జెట్ స్మాల్ కార్) ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌లో ఇప్పటికే ఓ ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు రెనో ఇండియా సిద్ధంగా ఉంది.
మరికొద్ది రోజుల్లోనే ఈ ఫోర్-వీల్ డ్రైవ్ రెనో డస్టర్ ఇండియాలో విడుదల కానుంది. గడచిన సంవత్సరం (2013)లో రెనో ఇండియా మొత్తం అమ్మకాలలో దాదాపు 75 శాతం వాటా డస్టర్ ఎస్‌యూవీదే. ఈ ఏడాదిలోనే డస్టర్ 4x4ను విడుదల చేసిన తర్వాత, రెనో ఇండియా వచ్చే ఏడాదిలో మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఇందులో ఒకటి మాస్ మార్కెట్‌ను ఉద్దేశించి, రూ.4 లక్షలకు దిగువన కంపెనీ అభివృద్ధి చేస్తున్న ఓ చిన్న కారు.
ఇంకొకటి మల్టీ పర్సస్ వెహికల్ సెగ్మెంట్లో హోండా మొబిలియో, మారుతి సుజుకి ఎర్టిగా, మహీంద్రా జైలో, షెవర్లే ఎంజాయ్ వంటి మోడళ్లకు పోటీగా విడుదల చేయబోయే ఓ సరికొత్త ఎమ్‌పివి. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో 2.2 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్న రెనో ఇండియా, దేశంలోని కార్ల కంపెనీల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రస్తుతం 2.2 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను మరో రెండు-మూడేళ్లలో 5 శాతానికి పెంచుకునే దిశగా కొత్త ఉత్పత్తులను విడుదల చేయనుంది.


Click it and Unblock the Notifications








