రూమర్: 2015లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ డీజిల్ లాంచ్!
దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న టాప్ 5 కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, వచ్చే ఏడాదిలో వ్యాగన్ఆర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా లభ్యం కావచ్చనే ప్రచారం జోరందుకుంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో డీజిల్ కార్లకు (ప్రత్యేకించి తక్కువ ధర కలిగిన డీజిల్ కార్లకు) మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసినదే. మరోవైపు మారుతి సుజుకి కూడా తమ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్‌తో కలిసి ఓ తక్కువ సామర్థ్యం కలిగిన డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. కంపెనీ విడుదల చేయనున్న ఎల్‌సివితో పాటుగా చిన్న కార్లలో కూడా ఈ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు.

వాస్తవానికి మారుతి సుజుకి డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ కార్ల పోర్ట్‌ఫోలియోనే అధికంగా ఉంది. మార్కెట్ ట్రెండ్‌ను బట్టి డీజిల్ కార్ల అభివృద్ధిపై దృష్టి సారించిన మారుతి సుజుకి, గుజరాత్‌లో ఓ డీజిల్ ఇంజన్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్‌లో మారుతి సుజుకి ఓ చిన్న డీజిల్ ఇంజన్‌ను తయారు చేయనుంది. ఈ సరికొత్త చిన్న డీజిల్ ఇంజన్‌ను ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పెట్రోల్ వెర్షన్ వ్యాగన్ఆర్‌లో కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
మారుతి ఆల్టో తర్వాత మారుతి సుజుకి నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న పెట్రోల్ కారు వ్యాగన్ఆర్ అనే విషయం మనకు తెలిసినదే. ఈ నేపథ్యంలో, మారతి వ్యాగన్ఆర్ పెట్రోల్ వెర్షన్‌తో పాటుగా డీజిల్ వెర్షన్‌లో కూడా లభిస్తే, ఇక ఈ మోడల్ అమ్మకాలకు తిరుగు ఉండదు. కేవలం వ్యాగన్ఆర్‌లోనే కాకుండా మారుతి ఏ-స్టార్, ఆల్టో (1000సీసీ వేరియంట్)లో కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకురావచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications








