క్రాష్ టెస్ట్ ఫెయిల్: మారుతి, నిస్సాన్‌లను సమర్థించిన సియామ్
గ్లోబల్ ఎన్‌సిఏపి (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో మేడ్ ఇన్ ఇండియా కార్లయిన మారుతి స్విఫ్ట్, డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్‌లు ఘోరంగా విఫలమై జీరో సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటంతో భారత ఆటోమొబైల్ పరిశ్రమలో కలకలం మొదలైంది. కొందరేమో ఈ కార్ కంపెనీలను విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం ఆయా కంపెనీలను సమర్థిస్తున్నారు.
తాజాగా.. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) కూడా మారుతి సుజుకి, నిస్సాన్ కంపెనీలకు మద్ధతు పలికింది. 'ప్రతి దేశానికి తమ స్వంత భద్రతా నిబంధనలు ఉంటాయని, మన కార్లు ప్రభుత్వం నిర్దేశించిన భద్రతా నిబంధనలను పాటిస్తున్నాయని' సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు.

గ్లోబల్ ఎన్‌సిఏపి పాటిస్తున్న ప్రోటోకాల్ ఇండియా కోసం డిజైన్ చేయబడినది కాదని, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే టెస్ట్‌లను చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. యూరప్ వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో సైతం క్రాష్ టెస్ట్‌ను గంటకు 56 కిలోమీటర్ల వద్ద నిర్వహిస్తారని, గ్లోబల్ ఎన్‌సిఏపి నిర్వహించినట్లుగా గంటకు 64 కిలోమీటర్ల వద్ద క్రాష్ టెస్ట్ చేయరని మాథుర్ అన్నారు.
భారతదేశంలో మన సగటు వేగం చాలా తక్కువని, ఒక నిర్ధిష్ట కారు దాని (గ్లోబల్ ఎన్‌సిఏపి) టెస్టులో పాస్ కాలేదని చెప్పటం ఓ రకంగా కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేయటమేనని ఆయన అన్నారు. యాక్సిడెంట్‌లో ఒక కారులో ఎంతమంది చనిపోయారన్న అంశం ఆధారంగా, సదరు కారు ప్రమాదకరమని నిరూపించేందుకు ఎలాంటి డేటా లేదని మాథుర్ తెలిపారు.

గ్లోబల్ ఎన్‌సిఏపి కేవలం కేవలం క్రాష్ టెస్ట్ ఆధారంగా మాత్రమే టెస్ట్ రిజల్ట్స్ జారీ చేసిందని, భారతదేశం ఇప్పటికే రోడ్డు భద్రతా నిబంధనలపై పని చేస్తోందని, ఇవి కేవలం క్రాష్ టెస్ట్‌ను మాత్రమే ఆధారంగా చేసుకొని కాకుండా మొత్తం భద్రతా పరమైన సమస్యలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త నిబంధనలు ఉంటాయని ఆయన చెప్పారు.
కార్ మేకర్లను కూడా మాథుర్ వెనుకేసుకొచ్చారు. ఇప్పటి వరకూ ఏ కార్ కంపెనీ కూడా తమ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ను దక్కించుకొందని కస్టమర్లను మోసం చేయలేదని, కస్టమర్లు కూడా తాము కొనుగోలు చేస్తున్నారో అనే దానిపై అవగాహన కలిగి ఉన్నారని అన్నారు. వాహన సేఫ్టీ విషయంలో గ్లోబల్ ఎన్‌సిఏపి కస్టమర్లకు అవగాహన కల్పించి, ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు అన్ని సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లను కొనుగోలు చేసేలా వారిని ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








