స్కొడా ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తి నిలిపివేత
స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న 'ఫ్యాబియా' హ్యాచ్‌బ్యాక్ ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు గడచిన సంవత్సరంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. భారత్‌లో ఫ్యాబియా కార్ల ఉత్పత్తిని నిలిపేశామని, కానీ విక్రయాలను కొనసాగిస్తున్నామని (స్టాక్ క్లియర్ అయ్యే వరకు) స్కోడా ఆటో ఇండియా సిఎమ్‌డి సుధీర్ రావు కొత్త స్కొడా సూపర్బ్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా వెల్లడించారు.
పూణేలో ఉన్న విక్రయానంతర సర్వీసుల కార్యాలయాన్ని కూడా మూసేశామని, అయితే ఫ్యాబియా ఉత్పత్తిని నిలిపివేసినంత మాత్రాన పూర్తిగా చిన్న కార్ల సెగ్మెంట్ నుంచి వైదొలగలేదని, తిరిగి ఈ సెగ్మెంట్‌లోకి పునఃప్రవేశిస్తామని ఆయన వివరించారు. ఒకప్పట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫ్యాబియా, ప్రస్తుతం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో పెరిగిన పోటీ నేపథ్యంలో ఈ మోడల్ అమ్మకాలు క్రమేనా తగ్గతూ వచ్చి కంపెనీ నష్టాలను మిగుల్చుతోంది.

స్కొడా ఇండియా తొలిసారిగా 2008లో ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. నిర్మాణ నాణ్యత, సౌకర్యం, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లతో ఫ్యాబియా మంచి ప్రీమయం కార్‌గా నిలిచింది. అయితే, ఈ మోడల్ అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ అనేక సార్లు ఫ్యాబియా ధరలో కోతను విధించింది. 2008 నుంచి ఇప్పటి వరకూ ఈ కారు ధరలో దాదాపు 40 శాతం కోతను విధించటం జరిగింది. దీంతో ఈ కారు అమ్మకంపై కంపెనీ నష్టాలను చవిచూస్తోంది.
స్కొడా ఫ్యాబియా 1.2 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి ఫ్యాబియా కారు అమ్మకంపై కంపెనీ 1.5 లక్షల మేర నష్టపోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న స్కొడా ఫ్యాబియా ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, 2015 లోపుగా ఓ సరికొత్త చవక ఫ్యాబియాను మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుతం లభిస్తున్న ఫ్యాబియాకు మోడిఫైడ్ వెర్షనా (ఎస్‌కె 250) లేక వచ్చే ఏడాది అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల కానున్న సరికొత్త ఫ్యాబియా (ఎస్‌కె260)నా అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








