కాంపాక్ట్ సెడాన్ తయారీపై కన్నేసిన స్కొడా ఇండియా
ఇప్పుడు భారత ఆటోమొబైల్ రంగానికి కాంపాక్ట్ సెడాన్ ఫీవర్ పట్టుకుంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే మారుతి సుజుకి (స్విఫ్ట్ డిజైర్), హోండా కార్స్ (అమేజ్), మహీంద్రా (వెరిటో వైబ్) కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రవేశపెడితే, తాజాగా టాటా మోటార్స్ (జెస్ట్), ఫోర్డ్ ఇండియా (ఫిగో సిఎస్), హ్యుందాయ్ (ఎక్సెంట్) కంపెనీలు తమ కాంపాక్ట్ సెడాన్ కార్లను ఆటో ఎక్స్‌పో 2014 ఆవిష్కరించాయి.
ఈ కాంపాక్ట్ కార్లను తయారు చేసే కంపెనీల జాబితాలోకి తాజాగా ఫోక్స్‌వ్యాగన్ కూడా వచ్చి చేరనుంది. ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ 'ర్యాపిడ్' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, కంపెనీ ఇందులో ఓ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రస్తుతం ర్యాపిడ్ సెడాన్‌ను తయారు చేస్తున్న పిక్యూ25 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొనే, ఇందులో ఓ సబ్-4 మీటర్ కారును (మొత్తం పొడవులో 4 మీటర్ల కన్నా తక్కువగా ఉండే కారును) అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కాంపాక్ట్ కారును మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్లాంటులో ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

కారు మొత్తం పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉండి, ఇంజన్ సామర్థ్యం 1500సీసీ (1.5 లీటర్) కన్నా తక్కువగా ఉంటే, సదరు కారును కాంపాక్ట్ కారుగా పరిగణించి, అధిక ఎక్సైజ్ సుంకం విధించడం నుంచి మినహాయించడం జరుగుతుంది. ఇలాంటి కార్లపై 12 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తారు.
అదే పెద్ద కార్లపై అయితే (4 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు, 1500సీసీ కన్నా ఎక్కువ ఇంజన్ సామర్థ్యం) ఇందుకు రెట్టింపులో ఎక్సైజ్ సుంకాన్ని విధించడం జరుగుతుంది. ఫలితంగా కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి వ్యయం తగ్గి, సరసమైన ధరకే వీటిని ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే, ఇప్పుడు కార్ మేకర్లంతా కాంపాక్ట్ సెడాన్ కార్ల తయారీపై దృష్టి సారిస్తున్నారు.


Click it and Unblock the Notifications








