కిజాషి, గ్రాండ్ విటారా మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసిన సుజుకి
కిజాషి ప్రీమియం సెడాన్ గుర్తుందా.. మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఇంపోర్టెడ్ లగ్జరీ కారు ఇది. కిజాషి సెడాన్‌ను మారుతి మాతృ సంస్థ, జపాన్‌కి చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ తయారు చేస్తోంది. ఇది భారత మార్కెట్లోనే కాదు, పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమవుతోంది. అయితే, దాదాపు అన్ని మార్కెట్లలో కూడా ఈ మోడల్ సక్సెస్ కాలేకపోయింది.
ఈ నేపథ్యంలో సుజుకి తమ కిజాషి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. అలాగే, కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ గ్రాండ్ విటారా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఎస్‌యూవీ కూడా కంపెనీ ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయింది. దీంతో సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని జపనీస్ కంపెనీ భావిస్తోంది.

సుజుకి మోటార్ కార్పోరేషన్ తొలిసారిగా 2009లో కిజాషి కారును తయారు చేసింది. ఈ రెండు మోడళ్లను జపాన్‌లోని ఇవాటాలో ఉన్న సుజుకి ఉత్పత్తి కేంద్రంలో తయారు చేస్తున్నారు. అక్కడి నుండే ఇవి అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే, ఈ రెండు మోడళ్లకు ఎలాంటి ప్రత్యక్ష రీప్లేస్‌మెంట్ మోడళ్లను సుజుకి ఇంకా ప్రకటించలేదు.
కానీ, విటారా పేరును మాత్రం సుజుకి తమ కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఉపయోగించుకోనుంది. ఈ సుజుకి విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది జరిగిన ప్యారిస్ మోటార్ షోలో కంపెనీ ప్రదర్శనకు ఉంచింది. ఈ మోడల్ ఇండియాకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. కాగా.. కిజాషి పేరును మాత్రం సుజుకి తిరిగి ఉపయోగించుకోవాలనుకోవటం లేదు.



Click it and Unblock the Notifications








