మారుతి గుజరాత్ ప్లాంట్‌ను కైవసం చేసుకున్న సుజుకి
ఒకప్పుడు భారతీయ కంపెనీగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మారుతి ఉద్యోగ్ లిమిటెడ్, ఇప్పుడు క్రమక్రమంగా జపాన్ వశమైపోతుంది. భారత ఆటోమొబైల్ చరిత్రలోనే సరికొత్త విప్లవాలకు నాంది పలికిన మారుతి సుజుకి, ఆ తర్వాత జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్‌తో చేతులు కలిపి, మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌గా అవతరించింది.
ఈ ఇండో-జపాన్ జాయింట్ వెంచర్‌లో ఇప్పుడు సుజుకికే మెజారిటీ వాటా ఉంది. దీంతో భారతదేశంలో మారుతిపై సుజుకి పైచేయి సాగిస్తోంది. ఇందుకు తాజా సంఘటనే నిదర్శనం. మారుతి సుజిక భారత్‌లోని తమ విస్తరణ ప్రణాళికోలో భాగంగా గుజరాత్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన తయారీ ప్లాంట్‌ను, దాని మాతృ సంస్థ సుజుకి మోటార్ ఎగరేసుకుపోయింది.

ఈ ప్లాంటును సుజుకి మోటార్ కార్పోరేషన్‌కు అప్పగించేందుకు మంగళవారం సమావేశమైన మారుతి సుజుకి బోర్డు నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సుజుకి గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను సుజుకి మోటార్ కార్పోరేషన్ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో భాగంగా ఏడాదికి లక్ష కార్ల తయారీ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఒసాము సుజుకి తెలిపారు.
ఆ తర్వాతి కాలంలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాలీనా 2.5 లక్షలకు పెంచనున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్‌లోగా సుజుకి గుజరాత్‌ను ఏర్పాటు చేస్తామని, ఇది అన్‌లిస్టెడ్ కంపెనీగా ఉంటుందని సుజుకి చెప్పారు. గుజరాత్‌లో సామర్థ్య విస్తరణ కోసం మారుతి 2011లో మేసానాకు దగ్గర్లో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఇందుకోసం కంపెనీ రూ.250 కోట్లను వెచ్చించింది.

మొత్తం రూ.4,000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు 2012లో మారుతి ప్రణాళికలు సిద్దం చేసుకుంది. అయితే మార్కెట్ పరిస్థితులు అనుకూలించక పోవటంతో, కొత్త ప్లాంట్ యోచనను కంపెనీ వాయిదా వేసింది. కాగా, సుజుకీ మోటార్ కార్పోరేషన్ ఇటీవల 100 శాతం అనుబంధ కంపెనీ ద్వారా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడంతో మారుతీ బోర్డు ఇందుకు అంగీకరించింది. స్థలాన్ని మాత్రం లీజుకి ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే, ఈ సుజుకి గుజరాత్ ప్లాంటులో తాము వాహనాలను తయారు చేసినప్పటికీ, వాటిని తిరిగి మారుతి సుజుకికే విక్రయిస్తామని ఒసాము సుజుకి వివరించారు. ఈ విధానం ద్వారా కంపెనీకి ఆర్థికపరమైన లబ్ది చేకూరుతుందని మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. దీని వలన అమ్మకాలు, మార్కెటింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వంటి కార్యకలాపాలను మరింత పటిష్టపరచుకునే అవకాశం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








