చైనా కార్ కంపెనీతో దోస్తీ చేయనున్న టాటా మోటార్స్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ చైనాకు చెందిన చెరీ ఆటోమొబైల్ కంపెనీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్న పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ మేరకు ఇరు కంపెనీల మధ్య చర్చలు కూడా జరుగుతున్న అటు చైనా మీడియాలోను ఇటు ఇండియా మీడియాలోను కథనాలు వస్తున్నాయి.
టాటా మోటార్స్, చెరీ ఆటోమొబైల్ కంపెనీల మధ్య చర్చలు సఫలమైతే.. చెరీ చైనా మార్కెట్లో విక్రయిస్తున్న తమ కార్లను భారత్‌లో టాటా మోటార్స్ ద్వారా విక్రయించే అవకాశం ఉంది. అలాగే, టాటా మోటార్స్ కూడా భారత మార్కెట్లో విక్రయిస్తున్న కొన్ని రకాల కార్లను చైనాలో చెరీ ఆటోమోటివ్ ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ చర్చలు ప్రారంభం దశలో ఉన్నట్లు సమాచారం. ఈ డీల్ ఓకే అయితే, చెరీ ఆటోమోటివ్ తమ క్యూక్యూ, ఏ1, ఎమ్1 మైక్రో సెడాన్, ఏ3 కాంపాక్ట్ సెడాన్ ప్లాట్‌ఫామ్‌లను టాటా మోటార్స్‌కు విక్రయించవచ్చని సమాచారం. చెరీ క్యూక్యూ (ఈ ఫొటోలో కనిపిస్తున్న కారు) ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకొని టాటా మోటార్స్ తమ నానోకి ఎగువన ఆల్టోకి పోటీగా ఓ ఎంట్రీ లెవల్ కారును తయారు చేయవచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఏదైనా కొత్త వాహన ప్లాట్‌ఫామ్‌ను ఆరంభం నుంచి అభివృద్ధి చేయటం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే అప్పటికే టెస్ట్ చేయబడి ఉండి, ఉపయోగంలో ఉన్న ప్రస్తుత వాహన ప్లాట్‌ఫామ్‌లను కొనుగోలు చేయటం అనేది, కొత్త ప్లాట్‌ఫామ్‌ను తయారు చేయటం కన్నా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. టాటా మోటార్స్ ఇదే ఆలోచనతో చెరీ వాహన ప్లాట్‌ఫామ్‌లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








