కొత్త రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ను విడుదల చేసిన టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ఓ కొత్త సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను నేడు (జనవరి 20, 2014) మార్కెట్లో విడుదల చేసింది. 'రెవోట్రాన్' (Revotron) పేరిట కంపెనీ ఈ కొత్త తరం పెట్రోల్ ఇంజన్ ఫ్యామిలీని కస్టమర్లకు పరిచయం చేయనుంది. ఈ సరికొత్త 1.2 లీటర్, ఫోర్-సిలిండర్, టర్బోచార్జ్డ్, ఇంటర్‌కూల్డ్, మల్టీ-పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ (ఎమ్‌పిఎఫ్ఐ) పెట్రోల్ ఇంజన్, భారతదేశంలో అభివృద్ధి చేసిన ఈ తరహా ఇంజన్లలో కెల్లా మొట్టమొదటి కావటం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్ యజమానులు, ఔత్సాహికులు మరియు నిపుణులైన డ్రైవర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త రెనోట్రాన్ సిరీస్ ఇంజన్లను డిజైన్ చేశామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్ ఈ రెవోట్రాన్ ఇంజన్లను అభివృద్ధి చేసేందుకు ఆస్ట్రియన్ గ్లోబల్ ఇంజన్ కన్సల్టెంట్ ఏవిఎల్ మరియు బాష్, హనీవెల్, మాహ్లే, ఐఎన్ఐ వంటి ఇతర సాంకేతిక భాగస్వామ్యుల సహకారాన్ని తీసుకుంది.

టాటా మోటార్స్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కొత్త రెవోట్రాన్ 1.2టి పెట్రోల్ ఇంజన్‌ను తక్కువగా బరువుగా ఉండేలా, అలాగే తక్కువ ఫ్రిక్షన్‌కు గురయ్యేలా డిజైన్ చేశామని, ఫలితంగా ఇది మెరుగైన పెర్ఫామెన్స్‌ను మంచి మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజన్ గరిష్టంగా 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 83.8 బిహెచ్‌పిల శక్తిని, 1,750-3,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.3 కెజిఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ (సెగ్మెంట్ ఫస్ట్)ను అందిస్తుందని మరియు దీని అడ్వాన్స్డ్ క్యాటలిస్ట్ కన్వర్టర్ వలన తక్కువ కర్భన వ్యర్థాలు విడుదలవుతాయని కంపెనీ వివరించింది. టాటా మోటార్స్ ఈ ఇంజన్ యొక్క నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్ (ఎన్‌విహెచ్ లెవల్స్)లను తక్కువగా ఉంచేందుకు ఇంజన్‌ను ధృడమైన క్రాంక్‌కేస్‌తో కవర్ చేశారు. రెవోట్రాన్ 1.2టి పెట్రోల్ ఇంజన్‌ను సిఎన్‌జి కిట్‌తో అనుసంధానం చేసుకోవచ్చు మరియు ఇది యూరో4, బిఎస్4 కాలుష్య నిబంధనలకు లోబడి ఉంటుంది.

ఈ కొత్త ఇంజన్‌ను తొలిసారిగా టాటా ఫాల్కన్ హ్యాచ్‌బ్యాక్ మరియు కాంపాక్ట్ సెడాన్లలో ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ రెండు మోడళ్లు వచ్చే ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. తమ రెవోట్రాన్ సిరీస్ ఇంజన్లను భవిష్యత్తులో 3-సిలిండర్, 4-సిలిండర్ ఆప్షన్లతో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని టాటా మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








