స్వచ్ఛంద పదవీ విరమణకు సై అన్న టాటా మోటార్స్!
ఆటోమొబైల్ రంగంలో కొనసాగుతున్న మాంద్యాన్ని తట్టుకోలేక తయారీదారులు చేతులు ఎత్తేస్తున్నారు. గత కొన్ని త్రైమాసికాల నుంచి ఆటోమొబైల్ రంగంలో మాంద్యం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాగే వాహనాల అమ్మకాలు రోజు రోజుకు మరింత క్షీణిస్తున్నాయి.
ప్రత్యేకించి దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్)ను ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది.
కాగా.. టాటా మోటార్స్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్) ప్రకటించడం ఇదే మొట్టమొదటి సారి. అయితే, ఎంతమంది వీఆర్‌ఎస్ తీసుకుంటారనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

గడచిన డిసెంబర్ 2013 నెలలో టాటా మోటార్స్ అమ్మకాలు 4.52 శాతం క్షీణించి 46,757 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా 45.83 శాతం క్షీణించి 25,738 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.
టాటా మోటార్స్‌తో పాటుగా హిందూజా గ్రూపుకు చెందిన అశోక్ లేలాండ్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఇందు కోసం రూ.43.58 కోట్లు ప్రత్యేకంగా కేటాయించామని, డిసెంబర్ 31వ తేదీ వరకు వీఆర్‌ఎస్ తీసుకునే వారికి అవకాశం కల్పిస్తామని టాటా మోటార్స్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








