2015లో స్మార్ట్ సిటీ కారుగా రానున్న టాటా నానో
ప్రపంచంలో కెల్లా అత్యంత చవకైన కారుగా ఒకప్పుడు అందరినోటా నానిన టాటా నానో కారు, ఇప్పుడు చవక ముద్ర కారణంగా కస్టమర్లకు దూరం అవుతున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టాటా నానో కారుపై పడిన చవక కారు ముద్రను పోగొట్టుకునేందుకు కంపెనీలు చర్యలు చేపట్టింది. 'పీపుల్స్ కారు'ను 'స్మార్ట్ సిటీ కారు'గా మార్చి వచ్చే ఏడాది మార్కెట్లో విడుదల చేయాలని టాటా మోటార్స్ భావిస్తోంది.
వచ్చే ఏడాది టాటా నానో కారును రీవ్యాంప్ చేసి, స్మార్ట్ సిటీ కారుగా ప్రవేశపెడతామని టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ వాగ్ తెలిపారు. టాటా నానో కారును అప్‌గ్రేడ్ చేసే విషయంలో కంపెనీ ఇటీవల ఇందులో ఓ పవర్ స్టీరింగ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, అమ్మకాలు మాత్రం జోరందుకోలేకపోయాయి. టాటా నానో కారుపై పడిన మచ్చలను మాపే విధంగా ఈ కారును అధునాతంగా తీర్చిదిద్దుతామని జెస్ట్ విడుదల సందర్భంగా గిరీష్ వెల్లడించారు.

గతంలో ఒకానొక సందర్భంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూడా టాటా నానో కారులో మరిన్ని అధనపు ఇంటెలిజెంట్ ఫీచర్లను జోడించి, ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లు మరియు మైలేజ్ అంశాలను మెరుగుపరచి దీనిని స్మార్ట్ ఫీచర్లతో 'స్మార్ట్ సిటీ కారు'గా మారుస్తామని వెల్లడించిన విషయం తెలిసినదే.
ప్రస్తుతం టాటా నానో పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ మరియు పవర్ స్టీరింగ్ వేరియంట్లలో కూడా లభిస్తోంది. ఇదిలా ఉండగా.. గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌లో టాటా మోటార్స్ ప్రదర్శనకు ఉంచిన ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఎక్విప్డ్ టాటా నానోకు కూడా వీలైనంత త్వరగా మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








