కొత్త అవతారంలో రానున్న 'టాటా నానో ప్లస్'
ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా ముద్ర వేసుకున్న టాటా నానో కారు విషయంలో టాటా మోటార్స్ పట్టు వదలని విక్రమార్కుడిగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పవర్ స్టీరింగ్ వెర్షన్ నానో ట్విస్ట్ విడుదల తర్వాత నానో డీజిల్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ రెండు వేరియంట్ల తర్వాత కంపెనీ ఓ సరికొత్త నానో కారును విడుదల చేయనుందనేది తాజాగా అందిన సమాచారం.
సరికొత్త అవతారంలో దర్శనమివ్వనున్న కొత్త నానో కారు పేరు 'టాటా నానో ప్లస్'. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, ఇంప్రూవ్డ్ ఎయిర్‌కాన్, బకెట్ సీట్స్, కొత్త డ్యాష్‌బోర్డ్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్స్, రివైజ్డ్ హుడ్ స్టయిలింగ్, ఓపనబల్ టెయిల్ వంటి ఆకర్షనీయమైన ఫీచర్లతో కొత్త టాటా నానో ప్లస్ వేరియంట్‌ను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. టాటా నానో కారుపై పడిన చవక కారు (చీప్ కార్) అనే ముద్రను తొలగించుకునేందుకే కంపెనీ ఈ ప్రయత్నాలు చేస్తోంది.

కొత్త నానోలో ఇంజన్ పరంగా కూడా మార్పు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో రెగ్యులర్ 0.6 లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు బదులుగా 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న నానో ఐదు వేరియంట్లలో (స్టాండర్డ్, సిఎక్స్, ఎల్ఎక్స్, సిఎన్‌జి సిఎక్స్, సిఎన్‌జి ఎల్ఎక్స్) అందుబాటులో ఉంది. ఇందులోని 624సీసీ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 38 పిఎస్‌ల శక్తిని, 51 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇకపోతే, టాటా మోటార్స్ త్వరలో విడుదల చేయనున్న డీజిల్ వెర్షన్‌లో 800సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 40.2 బిహెచ్‌పిల శక్తిని, 70 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలుస్తోంది. టాటా నానో డీజిల్ లీటరుకు 30 కి.మీ. లకు పైగా మైలేజీని ఇవ్వొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








