టొయోటా ఫార్చ్యూనర్‌లో చవక వేరియంట్ వస్తోందట..
జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా అందిస్తున్న పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 'ఫార్చ్యూనర్'లో కంపెనీ చవక వేరియంట్‌ను ఆఫర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంజన్ సామర్థ్యాన్ని మరియు కొన్ని ఫీచర్లను తగ్గించడం ద్వారా ఓ ఎంట్రీ-లెవర్ ఫార్చ్యూనర్ ప్రవేశపెట్టేందుకు టొయోటా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
టొయోటా ఫార్చ్యూనర్ ప్రస్తుతం మూడు వేరియంట్లలో లభిస్తోంది. అయితే, ఆటోకార్ ఇండియా కథనం ప్రకారం కంపెనీ ఇందులో మరో రెండు వేరియంట్లను అదనంగా చేర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టొయోటా ఫార్చ్యూనర్‌లో 3.0 లీటర్, 4-సిలిండర్, డి-4డి, టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 3600 ఆర్‌పిఎమ్ వద్ద 170 బిహెచ్‌పిల శక్తిని, 1400 ఆర్‌పిఎమ్ వద్ద 343 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బేస్ వేరియంట్లో ఇంజన్ నుంచి వచ్చే శక్తి వెనుక చక్రాలు (రియల్ వీల్ డ్రైవ్) బదిలీ అవుతుంది, ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మిడ్ వేరియంట్ టూవీల్ డ్రైవ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుండగా టాప్-ఎండ్ వేరియంట్ ఫోర్ వీల్ డ్రైవ్, మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోను లభిస్తోంది. ప్రస్తుతం దేశీయ విపణిలో టొయోటా ఫార్చ్యునర్ ధరలు రూ.21.81 లక్షల నుంచి 23.41 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).
తాజా రిపోర్ట్ ప్రకారం.. కొత్త టొయోటా ఫార్చ్యూనర్‌లో టూవీల్ డ్రైవ్, మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన బేస్ వేరియంట్లో 2.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది (బహుశా ఇన్నోవాలో ఉపయోగించే ఇంజన్ కావచ్చు). ఇన్నోవాలో ఉపయోగించిన 2.5 లీటర్ ఇంజన్ కేవలం 100 హార్స్‌పవర్‌ల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో, ఫార్చ్యూనర్‌లో ఉపయోగించబోయే ఈ 2.5 లీటర్ ఇంజన్ పవర్‌ను 142 హార్స్‌పవర్‌లకు పెంచి రీట్యూన్ చేసే అవకాశం ఉంటుంది.
కొత్త ఫార్చ్యూనర్ రేంజ్‌లోని టాప్-ఎండ్ వేరియంట్లో యధావిధిగా 3.0 లీటర్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఇందులో కొత్త బేస్ వేరియంట్ ప్రస్తుత బేస్ వేరియంట్ కన్నా సుమారు రూ.1 లక్ష వరకు తక్కువ (రూ.20.82) గాను మరియు కొత్త టాప్-ఎండ్ వేరియంట్ ప్రస్తుత టాప్-ఎండ్ వేరియంట్ కన్నా సుమారు రూ.1 లక్ష ఎక్కువ (రూ.24 లక్షలు) గాను ఉండొచ్చని అంచనా. ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి ఇవి మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








