2013లో కూడా వరల్డ్ నెంబర్ వన్ కార్‌మేకర్ టొయోటానే..!
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పోరేషన్ మూడేళ్ల తర్వాత తిరిగి తన అగ్రస్థానాన్ని దక్కించుకొని, ప్రపంచ అగ్రశ్రేణి వాహన కంపెనీ కిరీటాన్ని సొంతం చేసుకుంది. గడచిన సంవత్సరంలో టొయోటా రికార్డు స్థాయిలో మొత్తం 99.8 లక్షల వాహనాలను విక్రయించి ప్రపంచలో కెల్లా అగ్రగామి ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది. టొయోటా చరిత్రలో ఇవే అత్యధిక వార్షిక విక్రయాలని కంపెనీ ప్రకటించింది.
ఇప్పటి వరకు అగ్రస్థానాల్లో అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలను అధిగమించి టొయోటా తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది. గడచిన సంవత్సరంలో జనరల్ మోటార్స్ మొత్తం 97.1 లక్షల వాహనాలను విక్రయించగా, ఫోక్స్‌వ్యాగన్ 95 లక్షల వాహనాలను విక్రయించింది. అత్యధిక వాహనాలు విక్రయించిన కంపెనీగా దాదాపు ఏడు దశాబ్ధాల పాటు అగ్రస్థానంలో ఉన్న జనరల్ మోటార్స్‌ను టొయోటా 2008లో వెనక్కునెట్టి ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది.

కానీ.. ఆ తర్వాతి సంవత్సరాల్లో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీ వంటి ప్రకృతి వైపత్యాలు టొయోటాపైనే కాకుండా యావత్ జపాన్ ఆటోమొబైల్ రంగంపై గట్టి ప్రభావాలను చూపాయి. అయినప్పటికీ, టొయోటా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా, ఎప్పటికప్పుడు వ్యూహాత్మక ప్రణాళికలను రచించుకుంటూ పోయి, మూడేళ్ల పాటు కోల్పోయిన అగ్రస్థానాన్ని తిరిగి 2012లో కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2013లో కూడా 99.8 లక్షల వాహనాలను విక్రయించి తన అగ్రస్థానాన్ని అలానే నిలుపుకోగలిగింది.
జపాన్ కరెన్సీ యెన్ బలహీనపడడం, అమెరికా, చైనా దేశాల్లో అమ్మకాలు పుంజుకోవడం తదితర కారణాల వల్ల తాము ఈ ఘనత సాధించగలిగామని టొయోటా పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో (2014లో) కోటి వాహనాలు విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని కంపెనీ తెలిపింది. ఇదే గనుక జరిగితే ఒక్క సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా కోటి వాహనాలను విక్రయించిన మొట్టమొదటి కంపెనీగా టయోటా ప్రపంచ రికార్డు సృష్టించనుంది.


Click it and Unblock the Notifications








