చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది: ఉబెర్ డ్రైవర్ల తనిఖీ ప్రక్రియ
'చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు' అన్న సామెతగా రైడ్ షేరింగ్ కంపెనీ ఉబెర్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఢిల్లీ క్యాబ్ రేప్ ఘటన నేపథ్యంలో, ఉబెర్ తమ డ్రైవర్ల నియామకంలో సరైన విదివిధానాలు పాటించలేదని దేశవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కున్న ఈ క్యాబ్ కంపెనీ, ఇప్పుడు తాజాగా మరోసారి గ్రౌండ్ లెవల్ నుంచి డ్రైవర్ల తనిఖీ ప్రక్రియను ప్రారంభించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఓ ఉబెర్ క్యాబ్ డ్రైవర్ పాతికేళ్ల యువతిని కారులో ఎక్కించుకొని అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసినదే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కారు ఢిల్లీ క్యాబ్ ఆధారిత సేవలను నిషేధించింది. దీంతో గడచిన రెండు వారాలుగా ఢిల్లీలో ఉబెర్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉబెర్ తిరిగి ఢిల్లీలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు మరోసారి డ్రైవర్ల తనిఖీ ప్రారంభించింది.
ఉబెర్ వద్ద దాదాపు 10,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు ఉన్నారు. ఇందులో దాదాపు 2500 మంది ఢిల్లీలోనే ఉన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన ఉబెర్‌కు అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ ఇండియానే. గడచిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఉబెర్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అతికొద్ది సమయంలోనే ఇది భారత్‌లో అత్యంత ప్రాచుర్యాన్ని దక్కించుకుంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఉబెర్, ఢిల్లీలోని తమ డ్రైవర్లందరికీ ఓ ఎస్ఎమ్ఎస్‌ని పంపించింది. స్థానికులైతే తమకు సమీపంలోని పోలీస్ స్టేషన్ ద్వారా, ఇతరులైతే తమ స్వస్థలంలోని పోలీస్ స్టేషన్ ద్వారా సెకండ్-టైమ్ వెరిఫికేషన్‌ను పొందాలనేది ఆ ఎస్ఎమ్ఎస్ సారాంశం. అలాగే హైదరాబాద్, బెంగుళూరు, ముంబైలలోని డ్రైవర్లను కూడా సెకండ్-టైమ్ వెరిఫికేషన్ చేయించుకోవాలని ఉబెర్ కోరుతోంది.
ఉబెర్ ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, దానిపై పడిన మచ్చ మాత్రం ఇప్పట్లో చెరిగిపోయేలా కనిపించడం లేదు. అందుకే, ఉబెర్ మాదిరిగా సేవలందించే ఓలా, టాక్సీ ఫర్ షూర్ వంటి ఇతర యాప్ ఆధారిక క్యాబ్ కంపెనీలు రేడియో టాక్సీలను నియమించుకునే పనిలో పడ్డాయి. ఏదేమైనప్పటికీ, నగరాల్లో మహిళలకు టాక్సీల ప్రయాణం ఓ పీడకలగా పరిణమిస్తోందనేది జీర్ణించుకోలేని వాస్తవం.


Click it and Unblock the Notifications








