మార్చ్ 17న హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ విడుదల!
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20లో 'ఐ20 యాక్టివ్' అనే క్రాసోవర్ మోడల్‌ను మార్చ్ నెలలో విడుదల చేయనున్నట్లు గతంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ మోడల్‌ను మార్చ్ 17, 2015వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టనుంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇప్పటికే ఈ మోడల్‌ను ఇండియన్ రోడ్లపై విస్తృతంగా టెస్టింగ్ చేస్తోంది. ఐ20 యాక్టివ్ అఫీషియల్ స్కెచ్‌ను కూడా కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు.

కాగా.. హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో ఎలాంటి కొత్త ఇంజన్లను ఉపయోగించబోరు. ప్రస్తుత ఎలైట్ ఐ20లో లభిస్తున్న ఇంజన్లనే ఇందులోను ఉపయోగించనున్నారు.
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 ఇంజన్ ఆప్షన్లు:
- పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1197సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 హెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 18.6 కెఎంపిఎల్.
- డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఎలైట్ ఐ20లో 1396సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని సర్టిఫైడ్ మైలేజ్ 22.54 కెఎంపిఎల్.

ఈ టీజర్ స్కెచ్‌ను బట్టి గమనిస్తే హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మరింత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ను, ప్రొటెక్టివ్ క్లాడింగ్‌ను కలిగి ఉంటుంది. క్రాసోవర్ లుక్ కోసం దీని బంపర్లను కూడా రీడిజైన్ చేశారు. అలాగే, ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేయనున్నారు. ఐ20 యాక్టివ్ ఇంటీరియర్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








