భారత మార్కెట్ నుంచి తొలగిపోయిన హ్యుందాయ్ సొనాటా
భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న సొనాటా ప్రీమియం సెడాన్‌ను మార్కెట్ నుంచి తొలగించి వేసింది. గడచిన 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యుందాయ్ తమ పాపులర్ ఫ్లూయిడిక్ డిజైన్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన సొనాటాను మార్కెట్లో విడుదల చేసింది.
అయితే, ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగపోతుండటంతో, కంపెనీ ఈ మోడల్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించాలని నిర్ణయించుకుంది. డిసెంబర్ 2014లోనే హ్యుందాయ్ సొనాటా ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. మరి భవిష్యత్తులో కొత్త సొనాటా వస్తుందా లేదా అనే విషయం ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.

సిక్స్త్ జనరేషన్ హ్యుందాయ్ సొనాటా సెడాన్‌లో సరికొత్త 2.4 లీటర్ జిడిఐ (గ్యాసోలైన్ డైరెక్ట్ ఇంజెక్షన్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 198 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అత్యంత శక్తివంతమైన ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 13.08 కిలోమీటర్ల మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 12.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేషన్, అధిక కాంతినిచ్చే జెనాన్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, పెడల్ షిఫ్ట్, 10-రకాలుగా అడ్జస్ట్ చేసుకునే విధంగా అమర్చిన డ్రైవర్ పవర్ సీట్, 4-రకాలుగా అడ్జస్ట్ చేసుకునే ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ వంటి సదుపాయాలున్నాయి.

ఇంకా ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టిసిఎస్)తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), రియర్ వ్యూ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్‌తో కూడిన స్మార్ట్ కీ వంటి అత్యాధునిక సాంకేతిక మరియు భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








