రతన్ టాటాని అవమానించిన ఫోర్డ్, కానీ ఇప్పుడు..
భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సంస్థను ప్రారంభించిన రతన్ టాటా ఒకానొక సందర్భంలో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ నుంచి హేళనలు, అవమానాలను ఎదుర్కున్నారు. టాటా గ్రూప్ తమ కార్ల వ్యాపారాన్ని విక్రయించడం కోసం 1999లో ఫోర్డ్‌ను సంప్రదించినప్పుడు, ఫోర్డ్ టాటా గ్రూపును హేళన చేసి అవమానించింది.
కానీ అదే టాటా గ్రూప్ సరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత ఫోర్డ్ అధీనంలో ఉన్న బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్)ను కొనుగోలు చేసిఆ సంస్థ కష్టాల నుంచి గట్టెక్కించింది. అప్పట్లో జేఎల్ఆర్‌ను ఫోర్డ్ సరిగ్గా నిర్వహించలేక ఆ సంస్థను మూసేయాలనుకుంది. అలాంటి సమయంలో టాటా మోటార్స్ ఫోర్డ్ నుంచి జేఎల్ఆర్‌ను కొనుగోలు చేసి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం జేఎల్ఆర్ లాభాల పరంగా, అమ్మకాల పరంగా మార్కెట్లో దూసుకుపోతోంది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఫోర్డ్‌తో చర్చల సందర్భంగా రతన్ టాటా బృందంలోని కీలక సభ్యుడు ప్రవీణ్ కాడ్లే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

టాటా తమ కార్ల తయారీ విభాగాన్ని విక్రయించడానికి 1999లో డెట్రాయిట్‌లోని ఫోర్డ్ ఎగ్జిక్యూటివ్‌లను కలిసింది. అప్పుడు రతన్ టాటాతో పాటు ఆ బృందంలో ప్రవీణ్ కాడ్లే కూడా ఉన్నారు. ఆ మీటింగ్‌లో ఫోర్డ్ సభ్యుల నుంచి తీవ్ర అవమానాలను టాటా గ్రూప్ ఎదుర్కొంది.

అసలు టాటా గ్రూప్ ఈ వ్యాపారాన్ని ఎందుకు ప్రారంభించిందని, తమకు దీని గురించి ఏం తెలుసని, ఈ వ్యాపారాన్ని తాము కొనుగోలు చేసి ఉపకారం చేస్తామని ఫోర్డ్ అధికారులు హేళనగా మాట్లాడారు. ఆ మీటింగ్ తర్వాత టాటా బృందం సాయంత్రం న్యూయార్క్‌కు తిరిగొచ్చేసింది. ఆ 90 నిమిషాల విమాన ప్రయాణంలో రతన్ టాటా చాలా విచారంగా కనిపించారట

కానీ 2008లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏ టాటా కంపెనీనైతే కొనుగోలు చేస్తామని ఫోర్డ్ హేళన చేసిందో అదే టాటా కంపెనీ కష్టాల్లో ఉన్న జేఎల్ఆర్ (ఫోర్డ్ స్వాధీనంలో ఉన్న కంపెనీ)ను కొనుగోలు చేసి ఫోర్డ్‌ను నష్టాల నుంచి గట్టెక్కించింది.

ఈ టాటా-జేఎల్ఆర్ డీల్ సమయంలో రతన్ టాటాకు ఫోర్డ్ చైర్మన్ బిల్ ఫోర్డ్ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, జేఎల్ఆర్‌ను కొనుగోలు చేసి తకెంతో పెద్ద ఉపకారం చేశారని కూడా ఆయనను కీర్తించారు.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా దాదాపుగా దివాలా స్థితికి చేరుకున్న ఫోర్డ్ నుంచి జేఎల్‌ఆర్‌ను టాటా మోటార్స్ 2008వ సంవత్సరంలో 2.3 బిలియన్ డాలర్లు (దాదాపు 14,300 కోట్లు) చెల్లించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశీయంగా మందగమనం ఎదుర్కొంటున్న టాటా మోటార్స్‌కు జేఎల్ఆర్ ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications








