స్కోడా కొడియాక్ సాహస యాత్ర - మిడ్ ల్యాండ్ మీదకు ప్రయాణం

లగ్జరీ కార్ల దిగ్గజం స్కోడా డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి హిమాలయాల మీదుగా ఇండియా మరియు టిబెట్ మధ్య ఉన్న భూభాగానికి కొడియాక్ లగ్జరీ ఎస్‌యూవీతో సాహసోపేత యాత్ర చేసే ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది.

By Anil Kumar

లగ్జరీ కార్ల దిగ్గజం స్కోడా డ్రైవ్‌స్పార్క్ తెలుగు బృందానికి హిమాలయాల మీదుగా ఇండియా మరియు టిబెట్ మధ్య ఉన్న భూభాగానికి కొడియాక్ లగ్జరీ ఎస్‌యూవీతో సాహసోపేత యాత్ర చేసే ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తెలుగు మీడియాలో మరే ఇతర మీడియా సంస్థకు లభించని అత్యంత అరుదైన అవకాశం డ్రైవ్‌స్పార్క్ తెలుగు టీమ్‌కు లభించింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

"ది మిడిల్ ల్యాండ్"గా పిలువబడే స్పిటి వ్యాలీకి అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య సుమారుగా ఆరు రోజుల పాటు జరిగిన స్కోడా ఎక్స్‌పెడిషన్ డ్రైవ్‌లో డ్రైవ్‌స్పార్క్ తెలుగు టీమ్ తరపున ఇద్దరం పాల్గొన్నాము... జీవితంలో చచ్చేలోపు ఖచ్చితంగా చూసి తీరాల్సిన ప్రదేశాల్లో ఒకటైన స్పిటి వ్యాలీ మరియు ఆరు రోజుల పాటు హిమాలయాల్లో సాగిన స్కోడా ఎక్స్‌పెడిషన్ డ్రైవ్ అనుభవాలు మీ కోసం...

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఎక్స్‌పెడిషన్ డ్రైవ్ అంటే... ఒక ప్రయోజనం కోసం సాగే యాత్రను, ప్రత్యేకించి కొత్త ప్రదేశాలను అన్వేషించే ప్రయాణాన్ని ఎక్స్‌‌పెడిషన్ డ్రైవ్ అంటారు. టిబెట్ మరియు ఇండియా భూబాగం మధ్య ఉన్న ది మిడిల్ ల్యాండ్‌గా పిలువబడే స్పిటి వ్యాలీకి సాహస యాత్ర చేయాలని ఎంతో మంది తమ జీవితాశయంగా పెట్టుకుంటారు. అత్యంత దుర్భేధ్యమైన మార్గాల్లో భయంకరమైన వాతారణ పరిస్థితుల మధ్య ఈ ప్రదేశాన్ని చేరుకోవడాన్ని ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. అందుకే ఈ జర్నీని ఎక్స్‌పెడిషన్ డ్రైవ్ అంటారు.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఈ సాహస యాత్రకు స్కోడా కంపెనీ కొడియాక్ లగ్జరీ ఎస్‌యూవీని మాకు ఇచ్చింది. స్కోడా కొడియాక్ 7-సీటర్ మా యొక్క ఎక్స్‌పెడిషన్ డ్రైవ్‌కు బెస్ట్ ఛాయిస్ అయ్యింది. ఏడు మంది ప్రయాణించే ఇందులో ఇద్దరం మాత్రమే ప్రయాణించాము. విశాలమైన క్యాబిన్ ఉండటంతో ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఎలాంటి రహదారులనైనా సునాయసంగా ఎదుర్కోగల స్కోడా కొడియాక్‌తో మా ఎక్స్‌పెడిషన్ డ్రైవ్‍‌ను సురక్షితంగా ముగించాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మొదటి రోజు: ఛండీగర్ నుండి మనాలి వరకు

స్కోడా కొడియాక్ ఎక్స్‌పెడిషన్ మొదటి స్టేజ్ జర్నీ చంఢీగర్‌లోని హిమాలయన్ రిసార్ట్ టౌన్ నుండి మనాలి వరకు సాగింది. బెంగళూరు నుండి ఛండీగర్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయినప్పటి నుండి మా ప్రయాణం మొదలైంది. అప్పటికే స్కోడా కొడియాక్ వాహనాలు మా కోసం సిద్దంగా ఉన్నాయి. మండుటెండలో మా ప్రయాణం ప్రారంభమైనప్పటికీ, స్కోడా ఇచ్చిన కొడియా టిడిఐ ఆటోమేటిక్ వెహికల్ క్షణాల్లో కూల్ చేసింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

జర్నీ ప్రారంభించడానికి ముందు స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలోని అరుదైన డ్రైవింగ్ టెక్నాలజీ మరియు ఫీచర్లను గమనించాలనే ముందే డిసైడ్ అయ్యాము. ఎస్‌యూవీ బూట్ స్పేస్‌ను మా మొత్తం లగేజ్‌తో నింపేశాము. మరియు లోడింగ్ ఏరియా కూడా చాలా తక్కువ ఎత్తులో ఉంది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఎయిర్‌పోర్టు నుండి సరాసరి 300కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలికి ప్రయాణం ప్రారంభమైంది. విపరీతమైన ఎండ, దానికి తోడు దారిపొడవునా వెంటాడిన ట్రాఫిక్ మహమ్మారితో మా ప్రయాణం మరింత కష్టతరంమైంది. అయితే, స్కోడా లేటెస్ట్ ఎస్‌యూవీ తన అద్భుతమైన హ్యాండ్లింగ్‌తో చాలా ఈజీగా డ్రైవ్ చేయగలిగాము. చివరికి నగరాన్ని దాటేసి బిలాస్‌పూర్ దిశగా ట్రావెల్ చేశాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

వాతావరణం అనుకోకుండా మారిపోయింది. బిలాస్‌పూర్ సమీపానికి చేరుకోగానే నిమిషాల వ్యవధిలో వర్షం కుమ్మరించేసింది. ప్రయాణం సాగాలి, కానీ వర్షాన్ని ఆస్వాదించాలి. అయితే, స్కొడా కొడియాక్ ఎస్‌యూవీలో ఉన్న ప్యానరోమిర్ సన్‌రూఫ్ ద్వారా వర్షాన్ని కాస్త డిఫరెంట్‌గా ఎంజాయ్ చేశాము. మలుపులతో మొదలైన ప్రయాణంఎస్‌‌యూవీలోని క్యాంటన్ ఆడియో సిస్టమ్ అందించిన మ్యూజిక్‌తో ఫన్ డ్రైవ్ క్రియేట్ అయ్యింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మనాలినీ చేరుకునే క్రమంలో మా ప్రయాణం అందమైన పర్వతాల దిశగా సాగింది. ఎట్టకేలకు బాగా చీకటిపడ్డాక మనాలీలో స్కోడా ఆతిథ్యమిచ్చిన హోటల్‌ను చేరుకున్నాము. ఛండీగర్ వేసవి నుండి చల్లటి పర్వాతాల మధ్యనున్న మనాలిని చేరుకునే ప్రయాణం చాలా అద్భుతంగా సాగిపోయింది. గంటల వ్యవధిలోనే మారిపోయిన వాతావరణం ఓ కొత్త అనుభవాన్ని మిగిల్చింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

రెండవ రోజు: మనాలీ నుండి చంద్రతల్ వరకు

రోహ్తంగ్ పాస్ మార్గంలో ఎదురయ్యే ట్రాఫిక్ తప్పించుకోవడానికి రెండవ రోజు జర్నీ చాలా ముందుగా ప్రారంభించాము. ఉదయాన్నే ఆరు గంటలకే హోటల్ నుండి ప్రారంభమయ్యాం అప్పటికే వాతావరణం చాలా చల్లగా ఉంది. పర్వతాల మీదకు చేరుకునేసరికి గాలి కూడా చాలా దప్పంగా మారిపోయింది. అక్కడ మనం మందంగా అనిపించే గాలిని స్పష్టంగా చూడవచ్చు.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

పచ్చని ప్రకృతితో నిండిన ఉపరితలాల నుండి మంచుతో కప్పబడిన పర్వాతల మీదుగా మా ప్రయాణం సాగింది. కొడియాక్ ఎస్‌యూవీలోని 7-స్పీడ్ డీఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఎత్తైన రోహ్తంగ్ పాస్ రోడ్డును చాలా సులభంగా అధిగమించాము. మార్కెట్లో ఉన్న ఉత్తమమైన గేర్‌బాక్స్‌లో వోక్స్‌వ్యాగన్ వారి డైరెక్ట్ షిప్ట్ గేర్‌బాక్స్ ఒకటి.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

రోహ్తంగ్‌ను చేరుకున్నాక, అక్కడ నుండి లేహ్-మనాలి హైవే మీద ప్రయాణిస్తూ, మధ్యలో గ్రాంఫు వద్ద ప్రక్కకు తీసుకున్నాము. గ్రాంఫు నుండి మొదలైన రోడ్లు ఎంత కఠినంగా ఉన్నాయో... అక్కడి పరిసర ప్రకృతి దృశ్యాలు అంతే రమణీయంగా ఉన్నాయి. ఇదే మార్గంలో పలు నీటి ప్రవాహాలను దాటాల్సి వచ్చింది. ప్రధానంగా చీనాబ్ నదిని దాటడం ఎంతో సంతోషంగా అనిపించింది. స్కోడా కొడియా‌క్ ఎస్‍‌యూవీలో ఉన్న ఆల్-వీల్ డ్రైవ్ ద్వారా అన్ని రకాల రహదారులను ఎంతో సునాయాసంగా అధిగమించాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలో ఐదు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి, ఇకో, నార్మల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్ మరియు స్నో. నీటి ప్రవాహాలను దాటుతున్నపుడు ఎదురయ్యే వదులుగా ఉండే రోడ్డు మార్గాలకు స్నో డ్రైవింగ్ మోడ్ బాగా ఉపయోగపడింది. ఛాత్రు పర్వత శ్రేణుల్లో భోజన ఏర్పాట్లు చేశారు. పర్వతాల మధ్య భోజనం చేయడం మరో గొప్ప అనుభూతి.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

భోజనం తర్వాత చంద్రతల్ దిశగా మా ప్రయాణం మొదలైంది. ఛాత్రు వరకు అంతంతమాత్రంగా ఉన్న రోడ్డు అక్కడి నుండి చాలా దరిద్రంగా ఉన్నాయి. బహుశా అక్కడ రోడ్లు లేవనే చెప్పాలి. ఎటుచూసినా బండరాళ్లు, అంతం లేని మార్గాలు దర్శనమిస్తాయి.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మాతో పాటు ప్రయాణిస్తున్న మరి కొన్ని కొడియాక్ ఎస్‌యూవీలు ఈ మర్గంలో పంక్చర్‌కు గురయ్యాయి. కానీ, ఇలాంటి అవాంతరాలను ఎదుర్కునేందుకు స్కోడా ఇండియా బృందం అద్భుతమైన ఏర్పాటు చేసింది. అప్పటికే చాలా సమయం అయిపోవడంతో అన్ని స్కోడా కొడియాక్ ఎస్‌యూవీలు పర్వతాల మధ్య వరుసగా గమ్యం దిశగా వడివడిగా కదిలాయి.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఛాత్రు పర్వత శ్రేణులను దాటిన తర్వాత ఎదురైన ప్రకృతి దృశ్యాలు మమ్మల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. దూరంగా కనిపిస్తున్న మంచుతో కప్పబడిన మెరిసే పర్వతాలు అద్భుతంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ, ఆ దుర్భేద్యమైన మార్గంలో డ్రైవింగ్ నరకం అంచుల వరకు వెళ్లొచ్చిన అనుభవాన్ని మిగిల్చింది. సాయంకాలానికి బతల్ ప్రాంతంలో ఓ చిన్న టీ బ్రేక్ మా జర్నీకి కాస్త విశ్రాంతినిచ్చింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

రోజు గడిచిపోయేసరికి వాతావరణంలో ఉష్ణోగ్రత చాలా దారుణంగా పడిపోయింది. వేగంగా వీచే చల్లని గాలులు వెచ్చని ఉన్ని దుస్తుల గుండా శరీరాన్ని చేరడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. సాయంత్రం ఏడు గంటలకు అలా క్యాంప్ సైట్‌ను చేరుకున్నాము. రెండవ రోజు జర్నీలో 120 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఏకంగా 12 గంటల సమయం పట్టింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

జన నివాసాలు లేని ప్రాంతంలో క్యాంప్‌సైట్ ఏర్పాటు చేసి, అందరికీ విడివిడిగా టెంట్లను కేటాయించారు. మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అనే ఆశతో నిద్రలోకి జారుకున్నాము. రేపటి రోజును ప్రారంభించడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఏదేమైనప్పటికీ, పర్వత శ్రేణుల మధ్య ప్రకాశవంతంగా వెలుగుతున్న నక్షత్రాలతో మిరుమిట్లగొలుపుతున్న వినీలాకాశం జీవితంలో మరెన్నడూ లభించని మరపురాని అనుభవమనే చెప్పాలి. ఆ నిశీధిని చూస్తూ గడుపుతున్న సందర్భంలో శరీరం చలిని కూడా లెక్కచేయలేదంటే నమ్మండి.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మూడవ రోజు: చంద్రతల్ నుండి కాజా

ప్రణాళిక ప్రకారం మూడవ రోజు స్టేజ్-3 జర్నీ ప్రారభించడానికి ముందే చంద్రతల్ సరస్సును సందర్శించి, అక్కడి నుండే కాజా దిశగా ప్రయాణం ప్రారంభించాలి. క్యాంప్ సైట్ నుండి 20 నిమిషాల ప్రయాణం తరువాత, అక్కడ నుండి మరో 10 నిమిషాల నడక తరువాత చంద్రతల్ సరస్సును చేరుకున్నాము. అధిక సాంద్రతతో కూడిన గాలి వలన ఆ 10 నిమిషాలు కాస్త 10 గంటలను తలపించింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

నీలం రంగులో వయ్యారంగా ఉన్న చంద్రతల్ సరస్సు మరియు రమణీయమైన బ్యాక్‌గ్రౌండ్ చూసేసరికి, కష్టానికి తగ్గ ఫలితం లభించిందనిపించింది.

ఇది సరస్సు సముద్ర మట్టానికి సుమారుగా 4,250 మీటర్ల అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరస్సు చూడటానికి చంద్రవంక ఆకారంలో ఉండటం వలన దీనికి "చంద్రతల్" అనే పేరు వచ్చింది. హిమాలయ పర్వతాల మధ్య అత్యంత సుదరంగా ఉన్నటువంటి ఈ చంద్రతల్ సరస్సును వర్ణించడానికి మాటలు రావట్లేదు.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

వెంటనే, అక్కడి నుండి కాజా వైపుకు పయనమయ్యాముయ తరువాత ఎదురయ్యే సవాల్ కుంజుం పాస్ మార్గాన్ని దాటడం. అత్యంత ప్రమాదకరమైన డ్రైవ్‌లో ఇదీ ఒకటి. ఈ మార్గం చాలా ఇరుకుగా మరియు మలుపులు తిరిగిన వాలు తలాన్ని కలిగి ఉంటుంది. కానీ, కొడియాక్ పనితీరు మమ్మల్ని చాలా సురక్షితంగా గమ్యాన్ని చేరవేసింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మార్గ మధ్యలో మైదానాన్ని తలపించిన భూభాగంలో స్కోడా కొడియాక్‌తో కొద్దిసేపు ఫన్ డ్రైవ్ చేశాము. కొడియాక్‌తో చేయాలనుకున్న ప్రయోగాలన్నింటికీ ఈ మైదాన్ని వేదికగా మార్చుకుని మా సాహసోపేత యాత్రను కాస్త ఇట్రెస్టింగ్‌గా మలుచుకున్నాను. మూడవ రోజు సాయంత్రానికి కాజాలోని హోటల్‌ను చేరుకున్నాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

నాలుగవ రోజు: కాజా

స్కోడా ఎక్స్‌పెడిషన్ జర్నీ నాలుగు రోజు కాస్త విశ్రాంతిగానే సాగింది. సవాళ్లతో కూడిన మార్గాలు కాకుండా, కాడా చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాలను చాలా నెమ్మదిగానే అన్వేషించాము. వీలైనంత వరకు ఎక్కువ ప్రదేశాలను సందర్శించడానికి ఉదయాన్నే ప్రారంభమయ్యాము. జాబితా ప్రకారం మొదటి సందర్శించాల్సిన ప్రదేశం ధంకర్ మోనస్టేరి. వెనువెంటనే ఎదురయ్యే కఠినంగా ఉన్న మలుపుల గుండా మోనస్ట్రే దిశగా ప్రయాణం ప్రారంభమైంది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ధంకర్ మోనస్టేరి టిబెట్ సరిహద్దులో ఉన్న స్పిటి వ్యాలీలో ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఒకప్పుడు స్పిటి యొక్క రాజధాని. ధంకర్ మోనస్టేరి నుండి ఉత్కంఠభరితమైన ప్రదేశాలు కనవిందు చేశాయి. కొద్దిసేపు గడిపిన అనంతరం, టబు మోనస్టేరి వైపుకు ప్రయాణించాలని డిసైడ్ అయ్యాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

స్పిటి పర్వత శ్రేణుల్లోని టబు అనే గ్రామంలో మోనస్టేరి ఉంది. ప్రాంతీయంగా లభించే ఆహారంతో అక్కడే మధ్యాహ్న భోజనం చేశాము. భోజనం తరువాత ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశాలను సందర్శించడానికి పయనమయ్యాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

మొదట, హిక్కిమ్‌లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న పోస్ట్ ఆఫీసును చేరుకున్నాము. ఇది సముద్ర మట్టానికి 4,440 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సందర్భాన్ని మరిచిపోలేని అనుభవంగా మార్చుకునేందుకు మా సొంతం ఇంటికి లెటర్లు కూడా పోస్ట్ చేశాము. ఆ తరువా సముద్ర మట్టానికి 4,587 మీటర్ల ఎత్తులో రోడ్డు మార్గం ద్వారా చేరుకోగల కోమిక్ అనే ప్రపంచపు ఎత్తైన గ్రామాన్ని చేరుకున్నాము.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ప్రపంచపు అత్యంత ఎత్తైన గ్రామంలో భూమ్మీద అన్నింటికంటే ఎత్తులో ఉన్న మరియు రోడ్డు మార్గం ద్వారా చేరుకోగల రెస్టారెంట్ కూడా ఉంది. కోమిక్ గ్రామాన్ని వదిలేసరికి సాయంత్రం ఆరు గంటలయ్యింది.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

చీకటి పడటంతో మిగతా ప్రధాన దర్శనీయ ప్రదేశాలను చూడలేకపోయాము. చివర్లో ఫుట్‌హిల్స్ అనే ప్రాంతాన్ని దూరం నుండి వీక్షించి తిరుగుపయనమయ్యాము. దీంతో స్పిటి వ్యాలీ అధ్యయానికి ముగింపు పలికి హోటల్‌ను చేరుకున్నాము. ఐదు మరియు ఆరవ రోజు మా తిరుగు ప్రయాణం.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

ఒక్క మాటలో స్కోడా కొడియా ఎక్స్‌పెడిషన్ డ్రైవ్ అనుభవం...

ఆరు రోజుల స్కోడా కొడియాక్ ఎక్స్‌పెడిషన్ డ్రైవ్‌లో 1,000 కిలోమీటర్లు ప్రయాణించాము. మేము వెళ్లిన రోడ్లు సాధారణమైనవి కావు, హిమాలయ పర్వతాల మీదుగా, బండరాళ్లు, నీటి ప్రవాహాలు, జారుడు తలాలు, ఏట వాలు, పల్లపు తలాలు, భయంకరమైన గుండ్రటి మలుపులు, వంకరటింకర మార్గాల గుండా ప్రయాణించాము. సాధారణ వాహనంతో ఇలాంటి మార్గాల్లో ప్రయాణించడం ఏమాత్రం సాధ్యం కాదు.

స్కోడా కొడియాక్ సాహస యాత్ర

కొడియాక్ సాహసోపేత యాత్రలో అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. అత్యుత్తమ సస్పెన్షన్, విశాలమైన క్యాబిన్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాయి. కఠినమైన రోడ్ల మీద ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడింది. ఆఫ్ రోడ్ లేదా ఆన్ రోడ్ ఏ మార్గమైనా స్కోడా కొడియాక్ సునాయసంగా అధిగమిస్తుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: The Skoda Kodiaq Expedition — A Journey To ‘The Middle Land’
Story first published: Tuesday, July 10, 2018, 18:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X