టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మీద బుకింగ్స్ ప్రారంభం
టాటా మోటార్స్ ఇటీవల సరికొత్త నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి ఆవిష్కరించింది. తాజాగా, నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మీద దేశవ్యాప్తంగా అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆన్‌లైన్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదేని టాటా అధీకృత షోరూంలో బుక్ చేసుకోవచ్చు. నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని నెలల్లో అమ్మకాలకు సిద్దంగా విడుదల చేసి, దీని ధరలను టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించనుంది.

టాటా నెక్సాన్ ఇవి (ఎలక్ట్రిక్ వెహికల్) మూడు విభిన్న వేరియంట్లలో లభ్యంకానుంది. అవి, XM, XZ+ మరియు XZ+ LUX. ఈ మూడు వేరియంట్లలో అత్యాధునిక ఫీచర్లు ఎలక్ట్రానిక్ పరికరాలను అందించారు.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఫుల్లీ-ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయి ఆటో అప్లికేషన్లు గల 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెథర్ స్టీరింగ్ వీల్, రివర్ పార్కింగ్ అసిస్ట్, రివర్స్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ ఇంకా ఎన్నో ఫీచర్లున్నాయి.

డిజైన్ పరంగా సరికొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ చూడటానికి అచ్చం ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కన్వెన్షనల్ టైప్(పెట్రోల్/డీజల్ వెర్షన్) నెక్సాన్ ఎస్‌యూవీని పోలి ఉంటుంది. షార్ప్ హెడ్‌ల్యాంప్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎయిర్ ఇంటేకర్ మరియు ఫాగ్ ల్యాంప్స్ గల ఫ్రంట్ బంపర్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది.

టాటా నెక్సాన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్‌లో బ్లూ కలర్ హైలెట్స్ అధికంగా వచ్చాయి. ఫ్రంట్ బంపర్ మీదున్న సెంట్రల్ ఇంటేకర్ మీద, విండో లైన్స్ మరియు రియర్ డిజైన్‌లో బ్లూ కలర్ సొబగులు ఎక్కువగా ఉన్నాయి. ఇంటీరియర్‌లోని డ్యాష్ బోర్డు మీద కూడా బ్లూ లైన్స్ చూడొచ్చు.

సాంకేతికంగా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 30.2kWh సామర్థ్యం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ సప్లే చేస్తుంది. ఈ మోటార్ డీజల్ ఇంజన్‌కు సమానంగా 245ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సింగల్ ఛార్దింగ్‌తో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ 300కిమీల మైలేజ్‌నిస్తుంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీ కూడా అందించారు. సాధారణ ఛార్జర్ ద్వారా ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్‌కు 8 గంటల సమయం పడితే, ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 60 నిమిషాల్లోనే 80శాతం బ్యాటరీ ఛార్జ్ పూర్తవుతంది.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తుంది. అవి, సిగ్నేచర్ టీల్ బ్లూ, గ్లేజియర్ వైట్ మరియు మూన్‌లైట్ సిల్వర్. మరిన్ని వేరియంట్లు డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లో కూడా రానున్నాయి.

టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ టాటా మోటార్స్ యొక్క లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సరికొత్త "జిప్‌ట్రాన్ టెక్నాలజీ" ఈ నెక్సాన్ ఎస్‌యూవీలో ప్రవేశపెట్టింది. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే, దీని ధర సుమారుగా రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు. మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మరియు అతి త్వరలో విడుదల కానున్న ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








