వితారా బ్రిజాతో మరో మాయ చేస్తున్న మారుతి: తప్పక తెలుసుకోండి!
మారుతి సుజుకి 2020 వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఇటీవల ఆవిష్కరించింది. తాజాగా అందిన సమాచారం మేరకు, మారుతి తమ వితారా బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ వేరియంట్లకు సంభందించిన వివరాలను రివీల్ చేసింది. మీరు కనుక మారుతి వితారా బ్రిజా కొంటున్నట్లయితే.. ఫీచర్ల పరంగా ఏ వేరియంట్ మంచిదో ఇవాళ్టి స్టోరీలో వివరంగా తెలుసుకుందాం రండి...

మునుపటి వెర్షన్ బ్రిజా తరహాలోనే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కూడా అవే LXi, VXi, ZXi మరియు ZXi వేరియంట్లలో లభిస్తుంది. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి డీలర్లు ఇప్పటికే 2020 మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ మోడల్ మీద బుకింగ్స్ కూడా ప్రారంభించారు. ఎంచుకునే వేరియంట్ ఆధారంగా రూ. 11,000 నుండి రూ. 21,000 బుకింగ్ అమౌంట్ చెల్లించి బ్రిజా ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు.

మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ LXi వేరియంట్
మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ బేస్ వేరియంట్ LXi విషయానికి వస్తే, ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ డే టైమ రన్నింగ్ ల్యాంప్స్ మిస్సయ్యాయి, కానీ వీటి స్థానంలో హ్యాలోజియన్ హెడ్ ల్యాంప్ యూనిట్ వచ్చింది. అల్లాయ్ వీల్స్‌కు బదులుగా స్టీల్ వీల్స్ వచ్చాయి. ఆటోమేటిక్‌గా తెరుచుకునే సైడ్ మిర్రర్లు, రివర్స్ పార్కింగ్ కెమెరా, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 60:40 నిష్పత్తిలో మడిపే వీలున్న రియర్ వంటి కీలకమైన ఫీచర్లు ఇందులో మిస్సయ్యాయి.

అయితే, మారుతి బ్రిజా బేస్ వేరియంట్లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్ సైడ్ మిర్రర్లు, ఫ్యాబ్రిక్ సీట్లు, మ్యాన్యువల్ డే/నైట్ రియర్ వ్యూవ్ మిర్రర్, యూఎస్‌బీ, ఏయుఎక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ గల బేసిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ వంటివి వచ్చాయి.

బ్రిజా LXi ఫేస్‌లిఫ్ట్ వేరియంట్‌ను 1.5-లీటర్ పెట్రోల్ K15B బీఎస్6 ఇంజన్‌తో ఎంచుకోవచ్చు. 104బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఇంజన్ బేస్ వేరియంట్ కావడంతో కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తోంది.

మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ VXi వేరియంట్
బ్రిజా VXi వేరియంట్ విషయానికి వస్తే, ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు వచ్చాయి. పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లతో కూడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, కవర్స్ గల స్టీల్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్, ఆటోమేటిక్ ఏసీతో పాటు ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్ వంటివి అదనంగా వచ్చాయి.

కానీ ఇందులో రూఫ్ రెయిల్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ వైపర్, స్టీరింగ్ ఆధారిత ఆడియో కంట్రోల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు మిస్సయ్యాయి. ఇంజన్ విషయానికి వస్తే, పైన పేర్కొన్న అదే పెట్రోల్ ఇంజన్ కలదు.

మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ZXi వేరియంట్
బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ZXi వేరియంట్లో LXi మరియు VXi వేరియంట్లలో ఉన్న అన్ని ఫీచర్లు యధావిధిగా ఇందులో వచ్చాయి, వీటితో పాటు కొన్ని అదనపు ఫీచర్లను కూడా అందించారు. అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్ మరియు వాషర్, మ్యాన్యువల్‌గా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే ఫీచర్ గల డ్రైవర్ సీట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేయగల 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, న్యావిగేషన్, 60:40 నిష్పత్తిలో మడుపుకునే వీలున్న రియర్ సీట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు వచ్చాయి.

మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ZXi+ వేరియంట్
పైన పేర్కొన్న మూడు వేరియంట్లలోని అన్ని ఫీచర్లతో పాటు దాదాపు అన్ని ముఖ్యమైన ఫీచర్లను ZXi+ వేరియంట్లో అందించారు. పాత బ్రిజాతో పోల్చుకుంటే 2020 మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ఎన్నో రకాల అత్యాధునిక ఫీచర్లతో వచ్చింది. ఇందులో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం గల సైడ్ మిర్రర్లు మరియు రివర్స్ కెమెరా వంటివి వచ్చాయి.

ఇంటీరియర్‌లో లెథర్ ఫినిషింగ్ గల స్టీరింగ్ వీల్, డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ బాడీ పెయింట్ స్కీమ్, ఫ్రంట్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, ట్వీటర్ స్పీకర్లు వంటివి ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, సీట్ బెల్ట్ వార్నింగ్ మరియు హై-స్పీడ్ అలర్ట్ వంటివి ఉన్నాయి. 2020 మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ పూర్తి స్థాయిలో విడుదలైతే, దీని ప్రారంభ ధర రూ. 7.5 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అన్ని ఫీచర్లతో లభించే మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ ధర అధికంగా ఉంటుంది, బ్రిజా ఎస్‌యూవీని అందిరకీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఫీచర్లను తగ్గించి నాలుగు విభిన్న వేరియంట్లను అందుబాటులో ఉంచారు. 2020 బ్రిజా ఇకపై డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించదు, కేవలం పెట్రోల్ ఇంజన్‌తోనే ఎంచుకోవాలి.
భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా పేరుగాంచిన మారుతి బ్రిజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ అయితే విపణిలో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు టాటా నెక్సాన్ ఎస్‌యూవీల నోర్లు మూయించనుంది.


Click it and Unblock the Notifications








